ఒకప్పుడు చిన్నవైనా, పెద్దవైనా వస్తువుల కోసం మార్కెట్లు, సంతలకే వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ నేటి డిజిటల్ యుగంలో ఆ ప్రాధాన్యత తగ్గిపోయింది. స్మార్ట్‌ఫోన్ ఒకటుంటే చాలు.. ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండానే ప్రపంచమంతా మన చేతిలోకివచ్చేసింది. నేటి తరానికి ఆన్‌లైన్ షాపింగ్ (Online Shopping) అనేది అవసరం మాత్రమే కాకుండా అలవాటుగా మారిపోయింది. ఎన్నో రకాల ఉత్పత్తులు, బ్రాండ్లు, ధరల తేడాలను గమనించి, సులభంగా ఎంపిక చేసుకునే అవకాశం ఉండటం, అలాగే డోర్ డెలివరీ సౌకర్యం ఉండడం వలన ప్రజలు ఎక్కువగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లవైపు మొగ్గు చూపుతున్నారు.
PM Surya Ghar Scheme : మహిళా సంఘాల సభ్యులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్
ఈ ఆన్‌లైన్ షాపింగ్ ట్రెండ్‌పై కేంద్ర గణాంకాల శాఖ నిర్వహించిన తాజా సర్వేలో తెలంగాణ (Telangana) రాష్ట్రం ముందంజలో ఉందని వెల్లడైంది. దేశ సగటుతో పోలిస్తే ఎక్కువగా 35.1% కుటుంబాలు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నాయి. దక్షిణాదిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా, 23.4% తో ఆంధ్రప్రదేశ్ చివర్లో నిలిచింది. ముఖ్యంగా తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో ఆన్‌లైన్ షాపింగ్ చాలా వేగంగా విస్తరిస్తోంది. 56.6% మంది కుటుంబాలు ఈ విధంగా షాపింగ్ చేస్తుండగా, ఇది దేశవ్యాప్తంగా నాలుగో అత్యధిక స్థానం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా జాతీయ సగటు (16%)ను చేరుకుంది.
వివిధ రకాల ఉత్పత్తుల్లో, దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో 53.3% మంది ఆహారేతర వస్తువులను, 7.6% మంది ఆహార పదార్థాలను కొనుగోలు చేస్తున్నట్లు సర్వేలో తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో 75.7% మంది ఎక్కువగా వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్ వంటి ఆహారేతర వస్తువులను కొనుగోలు చేయగా, పట్టణాల్లో ఈ సంఖ్య 37.6%గా ఉంది. ఈ పరిణామం స్పష్టంగా చాటుతున్నది ఏమంటే, ఆన్‌లైన్ షాపింగ్ ఇప్పుడు భారతీయుల జీవన విధానంలో భాగమైపోయింది. సమయం, ధనసాధనాలను ఆదా చేయడమే కాకుండా, నూతన ఉత్పత్తుల గురించి తెలుసుకునే అవకాశం కల్పించడం వలన దీని ప్రాచుర్యం రోజురోజుకు పెరుగుతూనే ఉంది.