Petrol Bandh in Hyderabad : పెట్రోల్ బంద్ అనే వార్తలపై తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ క్లారిటీ

రెండు రోజులుగా హైదరాబాద్ లో పెట్రోల్ దొరకదు అనే వార్త వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఏ పెట్రోల్ బంక్ చూసిన వాహనదారులతో కిక్కిరిసిపోతున్నాయి. నిజంగానే పెట్రోల్ దొరకదేమో అని చాలామంది బంక్ లకు క్యూ కడుతున్నారు

Published By: HashtagU Telugu Desk
Petrol Bandh In Hyderabad

Petrol Bandh In Hyderabad

రెండు రోజులుగా హైదరాబాద్ లో పెట్రోల్ దొరకదు అనే వార్త వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఏ పెట్రోల్ బంక్ చూసిన వాహనదారులతో కిక్కిరిసిపోతున్నాయి. నిజంగానే పెట్రోల్ దొరకదేమో అని చాలామంది బంక్ లకు క్యూ కడుతున్నారు. అయితే పెట్రోల్ దొరకదు అనే వార్తలపై తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తలు కేవలం అవాస్తవాలని స్పష్టం చేసింది. ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మి వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్దకు క్యూ కట్టడంతో, అమ్మకాలు సాధారణం కంటే 2.5 నుండి 3 రెట్లు పెరిగాయి. ఈ హఠాత్తు పరిణామం వల్ల కొన్ని చోట్ల తాత్కాలికంగా నిల్వలు అయిపోయినట్లు కనిపిస్తున్నాయే తప్ప, సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేవని అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి అమరేందర్ రెడ్డి భరోసా ఇచ్చారు.

దేశీయ ప్రముఖ చమురు సంస్థలైన HPCL, IOCL మరియు BPCL వద్ద తగినంత పెట్రోల్ మరియు డీజిల్ నిల్వలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. సరఫరా గొలుసు (Supply Chain) ఎక్కడా ఆగలేదని, యథావిధిగా బంకులకు ఇంధనం చేరుతోందని స్పష్టం చేశారు. వినియోగదారులు ఆందోళన చెంది ట్యాంకులను ఫుల్ చేయించుకోవడం లేదా అవసరం లేకున్నా నిల్వ చేసుకోవడం వల్లే కృత్రిమ ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి కేవలం అవసరమైన మేరకే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని వారు కోరుతున్నారు.

ముఖ్యంగా పెట్రోల్, డీజిల్‌ను క్యాన్లు లేదా బాటిళ్లలో నింపి నివాస ప్రాంతాల్లో భద్రపరచడం అత్యంత ప్రమాదకరమని PESO (Petroleum and Explosives Safety Organization) నిబంధనలు హెచ్చరిస్తున్నాయి. ఇలా అనధికారిక కంటైనర్లలో నిల్వ చేయడం వల్ల అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఇది ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని అసోసియేషన్ గుర్తు చేసింది. తప్పుడు వార్తలను నమ్మవద్దని, ఇంధన భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని డీలర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. మరోపక్క మంత్రి ఉత్తమ్ కూడా స్పందించారు.ఇంధన కొరత ఏమీ లేదు, HPCL, IOCL మరియు BPCL సంస్థల వద్ద తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని అన్నారు.

  Last Updated: 25 Mar 2026, 03:49 PM IST