Site icon HashtagU Telugu

Telangana Govt: రేవంత్ స‌ర్కార్‌ న్యూ ప్లాన్.. ఇందిర‌మ్మ ఇండ్లు ఇక వేగ‌వంతం..

Indiramma Housing Scheme

Indiramma Housing Scheme

Telangana Govt: రాష్ట్రంలోని అర్హ‌త క‌లిగిన ప్ర‌తీపేద కుటుంబానికి ఇందిర‌మ్మ ఇండ్లు మంజూరు చేయాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం కృత‌నిశ్చ‌యంతో ఉంది. ఈ మేర‌కు గ్రామాల‌వారిగా ల‌బ్ధిదారుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించిన ప్ర‌భుత్వం వారిలోని అర్హుల‌ను ఎంపిక చేసి ఇందిర‌మ్మ ఇండ్లు మంజూరు చేస్తుంది. ఈ క్ర‌మంలో తొలి ద‌శ‌లో రాష్ట్ర వ్యాప్తంగా 72వేల మంది ల‌బ్ధిదారుల‌కు ఇండ్ల నిర్మాణానికి ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. వారిలో 12వేల మంది ల‌బ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. అందులో 500 మంది బేస్‌మెంట్ స్థాయి వ‌ర‌కు ప‌నులు పూర్తి చేశారు. అయితే, బేస్మెంట్ పూర్తి చేసిన ల‌బ్ధిదారుల‌కు ప్ర‌భుత్వం తొలి విడ‌త‌లో రూ.ల‌క్ష మంజూరు చేయాల్సి ఉంటుంది. అది జ‌ర‌గాలంటే అసిస్టెంట్ ఇంజ‌నీర్లు త‌నిఖీ చేసి స‌ర్టిఫై చేయాలి.. ప్ర‌స్తుతం 125 మంది మాత్ర‌మే ఇంజ‌నీర్లు ఉన్నారు. దీంతో ఈ ప్ర‌క్రియ కొంత మంద‌కొడిగా సాగుతుంద‌న్న వాద‌న జ‌రుగుతుంది. దీనికితోడు ఇందిర‌మ్మ ల‌బ్ధిదారులు త‌మ ఇండ్లు వేగంగా పూర్తిచేసేందుకు అధికారుల స‌ల‌హాలు, సూచ‌న‌లు క‌రువ‌య్యాయి. ఫ‌లితంగా ఇండ్ల నిర్మాణం ప్ర‌క్రియ నెమ్మ‌దిగా సాగుతుంది. దీంతో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

Also Read: Meenakshi Natarajan: అంద‌రివాద‌న‌లు వింటాం.. కంచ గ‌చ్చిబౌలి భూముల వ్య‌వ‌హారంపై మీనాక్షి న‌ట‌రాజ‌న్‌

ఇందిర‌మ్మ ఇళ్ల త‌నిఖీ బాధ్య‌త‌ను ప్ర‌భుత్వం ప్రైవేట్ ఇంజ‌నీర్ల‌కు అప్ప‌గించ‌బోతోంది. తొలుత 390 మందిని ఔట్ సోర్సింగ్ ప‌ద్ద‌తిలో నియ‌మించుకునేందుకు మేన్‌ప‌వ‌ర్ స‌ప్ల‌య‌ర్స్ కు బాధ్య‌త అప్ప‌గించింది. అందుకు నోటిఫికేష‌న్ జారీ అయింది. ఈ నెల 11వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది. ఎంపికైన అభ్య‌ర్థులు గృహ‌నిర్మాణ శాఖ ప‌రిధిలో ఔట్ సోర్సింగ్ ప‌ద్ద‌తిలో ఒక సంవ‌త్స‌రం ప‌నిచేయాల్సి ఉంటుంది. ఆమేర‌కు ముందుగా ఒప్పందం కుదుర్చుకోనుంది. వీరికి రూ.30వేల‌కుపైగా వేత‌నం చెల్లించ‌నున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం 125మంది ఇంజ‌నీర్లు ప‌నిచేస్తున్నారు. వీరితోపాటు ఔట్ సోర్సింగ్ విధానంతో ఎంపికైన అభ్య‌ర్థులు ఇందిర‌మ్మ ఇండ్లు ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసేలా చ‌ర్య‌లు తీసుకోనున్నారు.

Also Read: Pithapuram : పిఠాపురంలో రాజకీయ లెక్కలు మారుతున్నాయా..?

ఇందిర‌మ్మ ప‌థ‌కం కింద తొలి ద‌శ‌లో ఇండ్లు మంజూర‌యిన వారిలో ఇంటి నిర్మాణాలు చాలా మంది ప్రారంభించాల్సి ఉంది. వారందిరిచేత ఇందిర‌మ్మ ఇండ్లు ప్రారంభింప‌జేయ‌డంతోపాటు.. ఎప్ప‌టిక‌ప్పుడు ఫొటోలు తీసి యాప్‌లో పొందుప‌ర్చి ద‌శ‌ల‌వారిగా వారికి రావాల్సిన నిధులు వేగంగా ప‌డేలా నూత‌నంగా ఔట్ సోర్సింగ్ విధానంలో ఎంపికైన వారు చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంటుంది. త‌ద్వారా ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణాల ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తుంది.