Telangana Rythu Bharosa Status: ఆ రోజు మీ అకౌంట్ లోకి రైతు భరోసా…డేట్ ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ పంట సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో అన్నదాతలకు ప్రభుత్వం తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. పంట పెట్టుబడుల కోసం రైతులు అప్పుల పాలవ్వకుండా సకాలంలో ఆర్థిక సహాయం అందించేలా రైతు భరోసా పథకం అమలుకు వ్యవసాయ, ఆర్థిక శాఖలు సంయుక్తంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ సీజన్‌లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుందనే అంచనాలతో అర్హులైన ప్రతి రైతుకు ఎకరానికి రూ. 6 వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లోనే పెట్టుబడి సాయం […]

Published By: HashtagU Telugu Desk
Telangana government fixes the date for the Rythu Bharosa deposit into your account.

Telangana government fixes the date for the Rythu Bharosa deposit into your account.

తెలంగాణ వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ పంట సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో అన్నదాతలకు ప్రభుత్వం తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. పంట పెట్టుబడుల కోసం రైతులు అప్పుల పాలవ్వకుండా సకాలంలో ఆర్థిక సహాయం అందించేలా రైతు భరోసా పథకం అమలుకు వ్యవసాయ, ఆర్థిక శాఖలు సంయుక్తంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ సీజన్‌లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుందనే అంచనాలతో అర్హులైన ప్రతి రైతుకు ఎకరానికి రూ. 6 వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లోనే పెట్టుబడి సాయం జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం జిల్లా వేదికగా ఈ ప్రతిష్టాత్మక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కొత్తగా డిజిటల్ పట్టా పాస్‌బుక్‌లు పొందిన రైతులకు సైతం నోటిఫికేషన్ వచ్చిన వారం రోజుల్లోనే నిధులు విడుదల కానున్నాయి.

గత యాసంగి సీజన్‌లో ప్రభుత్వం గరిష్ఠంగా కేవలం రెండు ఎకరాల వరకే సాయం అందించడంతో రైతుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమైంది. దీనిపై ప్రతిపక్షాల నుంచే కాకుండా అధికార పక్ష ఎమ్మెల్యేల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. క్షేత్రస్థాయిలో రైతుల నుంచి నిలదీతలు ఎదురవుతున్నాయని, ఇది భవిష్యత్తులో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలపై గట్టి దెబ్బ కొడుతుందని పలువురు ప్రజాప్రతినిధులు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ప్రభుత్వం.. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి చిన్న, సన్నకారు రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని నిర్ణయించింది.

అయితే.. ఖజానాపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడంతో పాటు నిజమైన సాగుదారులకే లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈసారి సాయంపై కటాఫ్ పరిమితి విధించేందుకు కసరత్తు చేస్తోంది. ఇకపై కేవలం ఐదు నుంచి ఏడున్నర ఎకరాల లోపు భూమి ఉన్నవారికే ఈ పథకాన్ని పరిమితం చేయాలని యోచిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 1.40 కోట్ల ఎకరాల సాగుభూమి, 70 లక్షల మంది పట్టాదారులు ఉండగా.. గతంలో సాగు చేయని బీడు భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, రహదారులు, కాలువల కిందకు వెళ్లిన సుమారు 5.50 లక్షల ఎకరాలను వ్యవసాయ శాఖ శాటిలైట్ సర్వే ద్వారా గుర్తించింది.

ఇలాంటి వ్యవసాయేతర భూములను లబ్ధిదారుల జాబితా నుండి దశలవారీగా తొలగించడం ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 1200 కోట్ల ప్రజాధనం ఆదా అవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. పెద్ద భూస్వాములకు, సాగు చేయని వ్యాపార భూములకు అనవసరంగా నిధులు ధారపోయడం కంటే.. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద రైతులకు ప్రాధాన్యత ఇవ్వడమే పారదర్శక పాలనకు నిదర్శనమని ప్రజాప్రతినిధులు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఆర్థిక శాఖ నుండి నిధుల గ్రీన్ సిగ్నల్ రాగానే ఏకకాలంలో రైతుల ఖాతాల్లో ఈ నెలాఖరు నాటికి సాయం జమ కానుంది.

 

  Last Updated: 16 Jun 2026, 12:07 PM IST