Gadwal Vijaya Laxmi: మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి సోదరి అదృశ్యం

హైదరాబాద్ నగరంలో ఒక సంచలన మిస్సింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్, హైదరాబాద్ మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సొంత సోదరి నమ్రత అదృశ్యమయ్యారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని కమాన్ పరిసర ప్రాంతంలో నివసించే గద్వాల్ విజయలక్ష్మి సోదరి కె. నమ్రత (57) ఈ నెల 4న ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా బయటకు వెళ్లారు. అయితే, రోజులు గడుస్తున్నా ఆమె తిరిగి ఇంటికి […]

Published By: HashtagU Telugu Desk
Sister of Women's Commission Chairperson Gadwal Vijayalakshmi goes missing.

Sister of Women's Commission Chairperson Gadwal Vijayalakshmi goes missing.

హైదరాబాద్ నగరంలో ఒక సంచలన మిస్సింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్, హైదరాబాద్ మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సొంత సోదరి నమ్రత అదృశ్యమయ్యారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని కమాన్ పరిసర ప్రాంతంలో నివసించే గద్వాల్ విజయలక్ష్మి సోదరి కె. నమ్రత (57) ఈ నెల 4న ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా బయటకు వెళ్లారు. అయితే, రోజులు గడుస్తున్నా ఆమె తిరిగి ఇంటికి రాకపోవడం, బంధుమిత్రుల ఇళ్లల్లో వెతికినా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. దీంతో గద్వాల్ విజయలక్ష్మి స్వయంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.

గద్వాల్ విజయలక్ష్మి తన ఫిర్యాదులో కొన్ని సంచలన విషయాలను ప్రస్తావించారు. తన సోదరి నమ్రత అదృశ్యం వెనుక కొందరు వ్యక్తుల ప్రమేయం ఉండి ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సతీష్, సత్యనారాయణ, కుమారి అనే ముగ్గురు వ్యక్తులపై తనకు అనుమానాలు ఉన్నాయని ఆమె తెలిపారు. వారిని విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని విజయలక్ష్మి తన ఫిర్యాదులో ప్రత్యేకంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదు ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు ప్రాథమికంగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న ముగ్గురు అనుమానితుల వివరాలను సేకరించడంతో పాటు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. నమ్రత ఆచూకీ కనుగొనేందుకు బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

ఈ మిస్సింగ్ కేసు ద్వారా ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా రాజకీయాల్లోనూ, పబ్లిక్ లైఫ్‌లోనూ సీనియర్ నేత కె. కేశవరావు గారికి ముగ్గురు పిల్లలేనని అందరూ భావిస్తుంటారు. కానీ, కె. నమ్రత కూడా కేశవరావు గారి కుమార్తె. ఆమె మొదటి నుంచి రాజకీయాలకు, మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటూ కేవలం వ్యక్తిగత జీవితానికే పరిమితమయ్యారు. ఇప్పుడు ఈ మిస్సింగ్ కేసు విషయమై గద్వాల్ విజయలక్ష్మి స్వయంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతోనే నమ్రత ఆమెకు సొంత సోదరి అనే విషయం అందరికీ తెలిసింది. ఇక కేశవరావు కుమారుడు కె. విప్లవ్ కుమార్ గతంలో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TUFIDC) చైర్మన్‌గా పనిచేశారు. కె. వెంకటేశ్వర రావు ఈయన మరొక కుమారుడు.

ఇదిలా ఉండగా, ఉన్నత స్థాయి రాజకీయ కుటుంబానికి చెందిన మహిళ మిస్సింగ్ కావడం సంచలనంగా మారింది. ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకొని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నారు. ఆమె చివరి సారిగా ఎవరితో మాట్లాడింది? మొబైల్ సిగ్నల్స్ ఎక్కడ చూపిస్తున్నాయి? అనే సాంకేతిక ఆధారాలను కూడా విశ్లేషిస్తున్నారు. త్వరలోనే ఆమె ఆచూకీ కనిపెడతామని పోలీసులు చెబుతున్నారు.

  Last Updated: 15 Jun 2026, 02:01 PM IST