తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి పంజా విసిరింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి నివాసం, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు చేపట్టారు.
ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలోని బృందాలు మంగళవారం తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో ఈ తనిఖీలు ప్రారంభించాయి. హైదరాబాద్‌లోని చత్రినాకలో ఉన్న నరహరి నివాసం, ఆయన కార్యాలయంతో పాటు ఆయనకు సంబంధం ఉన్న మరో 11 ప్రాంతాల్లో అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు.
తన అధికారిక ఆదాయ వనరులకు మించి నరహరి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ఈ కేసు నమోదు చేసింది. ఇటీవల రాష్ట్రంలో రెవెన్యూ, భూ సంబంధిత శాఖల్లోని అధికారులపై ఏసీబీ ప్రత్యేక నిఘా పెట్టిన తరుణంలో ఈ సోదాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, ఎంత మొత్తంలో అక్రమాస్తులు గుర్తించారు, ఏయే పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అనే పూర్తి వివరాలు తనిఖీలు ముగిసిన అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
