Deputy CM Bhatti : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం, ఆత్మగౌరవాలను ప్రశ్నార్ధకం చేసే రీతిలో కేంద్ర సర్కారు వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు కోసం, ఇక్కడి సమాజం కోసం, కలల కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఐదుగురి పేర్లను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా పద్మ అవార్డులకు సిఫారసు చేస్తే కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. తాము సిఫారసు చేసిన వారిలో కనీసం ఒక్కరికి కూడా పద్మ అవార్డును ఇవ్వకపోవడం దారుణమని భట్టి పేర్కొన్నారు.
Also Read :Unified Pension Scheme: బడ్జెట్‌కు ముందే కీలక నిర్ణయం.. ఏప్రిల్ 1 నుండి UPS అమలు!
‘‘తెలంగాణ ప్రభుత్వం తరఫున సిఫారసు చేసిన వారిలో ఒక్కరికి కూడా పద్మ అవార్డును పొందే అర్హత లేదా? తెలంగాణ సాధనకు పాటుపడిన ప్రజా యుద్ధనౌక గద్దర్, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమల రావు పేర్లను పద్మ పురస్కారాల కోసం మేం సిఫారసు చేశాం’’ అని డిప్యూటీ సీఎం వెల్లడించారు. ‘‘ కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా నడుచుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఐదుగురిలో ఒక్కరికి కూడా అవార్డు ఇవ్వకపోవడం అన్యాయం’’ అని ఆయన ఫైర్ అయ్యారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన వారికి పురస్కారాలను అందించి, తెలంగాణ ప్రభుత్వం సూచించిన వారికి ఇవ్వకపోవడం ముమ్మాటికీ అన్యాయమే. మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ ఇవ్వడం అభినందనీయం’’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti) పేర్కొన్నారు.
Also Read :Jagan- Bharati: జగన్- భారతి మధ్య విభేదాలు.. బీజేపీ ఎమ్మెల్యే సంచలనం!
తెలుగు రాష్ట్రాల నుంచి వీరికే పద్మాలు..
- తెలంగాణకు చెందిన ప్రఖ్యాత జీర్ణ కోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్‌రెడ్డికి పద్మ విభూషణ్ ప్రకటించారు.
- నటుడు బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం వచ్చింది.
- తెలంగాణకు చెందిన మాదిగ రిజర్వేషన్ ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారం వచ్చింది.
- ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ అవధాన విద్వాంసుడు మాడుగుల నాగఫణిశర్మ, ప్రముఖ విద్యావేత్త, రచయిత కేఎల్ కృష్ణ, కళారంగానికి చెందిన మిరియాల అప్పారావు(మరణానంతరం), విద్యారంగానికి చెందిన వాధిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖిలకు పద్మశ్రీ పురస్కారాలు వచ్చాయి.