Bandi: ‘తెలంగాణ’లో ‘షరియత్ చట్టాన్ని’ అమలు చేసే కుట్ర చేస్తున్న ‘కేసీఆర్’ – ‘బండి సంజయ్’..!

తెలంగాణలో షరియత్ చట్టాన్ని అమలు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.

  • Written By:
  • Publish Date - March 21, 2022 / 12:50 AM IST

తెలంగాణలో షరియత్ చట్టాన్ని అమలు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. అందులో భాగంగానే బోధన్ లో శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్న హిందూ వాహిని, భజరంగదళ్ కార్యకర్తలపై పోలీసులు విచక్షణారహితంగా దాడులు చేసి, కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో స్థానిక పోలీస్ కమిషనర్ వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం సాయంత్రం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధులు టి.వీరేందర్ గౌడ్, జె.సంగప్ప, కార్యదర్శి ఉమారాణి తదితరులతో కలిసి బండి సంజయ్ మాట్లాడారు.

బోధన్ లో భజరంగ్ దళ్, హిందూ వాహిని యువకులపై ముస్లిం చాందసవాదులు, పోలీసులు కలిసి దాడి, లాఠీఛార్జ్ చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. బోధన్ చౌరస్తాలో శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టించాలని మున్సిపాలిటీ పాలకవర్గం తీర్మానించి అనుమతించిన తర్వాత కూడా టీఆర్ఎస్ మైనారిటీ నాయకులు రాళ్ల దాడి చేయడం మూర్ఖత్వం. స్వయంగా పోలీస్ కమిషనర్ కార్యకర్తలను బండ బూతులు తిడుతూ లాఠీఛార్జ్ చేస్తూ రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరపడం హేయమైన చర్య అని విమర్శించారు బండి సంజయ్.

‘‘ ఖబడ్దార్ సీపీ…. ఎంత ధైర్యం? హిందూ వాహిని, భజరంగ్ దళ్ కార్యకర్తలను నానా బూతులు తిడుతూ లాఠీలతో కొడతావా? ఇదేమిటని ప్రశ్నిస్తే రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరుపుతావా? రాళ్లతో దాడులు చేయిస్తావా? నీ ఒంటిపై ఖాకీ డ్రస్ లేకుంటే నిన్ను కుక్కలు కూడా దేకవని గుర్తుంచుకో…’’అని మండిపడ్డారు బండి సంజయ్. బోధన్ లో మున్సిపల్ పాలకవర్గం తీర్మానం మేరకు శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టిస్తుంటే… పోలీస్ కమిషనర్ కు వచ్చిన ఇబ్బందేమిటని ప్రశ్నించారు. శివాజీ విగ్రహం కాకుండా అక్కడ ఔరంగజేబు విగ్రహం పెట్టాలా? సీఎం మోచేతి నీళ్లు తాకేందుకు అలవాటుపడిన సీపీ లాంటి కొందరు పోలీసులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు బండి సంజయ్. ఏదైనా సమస్య వస్తే పరిష్కరించాల్సిన స్థానిక పోలీస్ కమిషనర్ అందుకు భిన్నంగా హిందూ వాహిని, భజరంగ్ దళ్ కార్యకర్తలను నానా బూతులు తిడుతూ లాఠీలతో కొట్టడమేంటి? ఈ సీపీకి ఎంపీ టిక్కెట్ ఇస్తానని కేసీఆర్ చెప్పాడట. సీపీయే స్వయంగా ఈ విషయం మీడియాతో చెప్పాడు. ఇలాంటి వ్యక్తులు సీపీగా ఉండటం సిగ్గు చేటు. ఆయన పదవి దిగిపోయాక కుక్క కూడా దేకదు. ప్రజలు సీపీని ఛీదరించుకుంటున్నారు. ఐపీఎస్ అధికారుల సంఘం దీనికి ఏం సమాధానం చెబుతుంది? క్రిమినల్స్ ను కంట్రోల్ చేయలేని దమ్ములేని అధికారులు, చట్టాన్ని కాపాడాలేని సీపీ లాంటి వాళ్లు ఉద్యోగానికి రిజైన్ చేసి ఇంట్లో కూర్చోవాలి. ఒక వర్గానికి కొమ్ముకాసే సీపీ లాంటి అధికారులను బీజేపీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు బండి సంజయ్.

బీజేపీ పదేపదే రెచ్చగొడుతోందని ఊదరగొట్టే కేసీఆర్… బోధన్ లో జరిగిన ఘటనకు ఏం సమాధానం చెబుతారు? తెలంగాణలో షరియత్ చట్టాన్ని అమలు చేసే కుట్ర కేసీఆర్ చేస్తున్నాడు. ఎంఐఎం నాయకులు ఏది చెబితే కేసీఆర్ అది అమలు చేస్తున్నాడు. శివాజీ విగ్రహాలు పెట్టనీయడు. హనుమాన్ ర్యాలీలు చేయనీయడు. గణేష్ నిమజ్జనం చేయనీయడు. ఇదేమని ప్రశ్నిస్తే… మతతత్వ వాదులని ప్రచారం చేస్తున్నాడు. హోంమంత్రి ఈ విషయాలపై అసలే స్పందించరు. రోహింగ్యాలకు షెల్టర్ కల్పించడమే ఆయన పనిగా పెట్టుకున్నాడు. కేసీఆర్ ఒక్కటి గుర్తుంచుకోవాలి…. నీ షరియత్ చట్టాలను ఇక్కడ అమలు చేయనీయం. అడ్డుకుని తీరుతాం. నీ బండారాన్ని బయట పెడతాం. బోధన్ సీపీపై తక్షణమే చర్యలు తీసుకునే దాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు బండి సంజయ్.

సిరిసిల్లలో టీఆర్ఎస్ గూండాలపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్ కు వెళితే.. స్టేషన్లోనే టీఆర్ఎస్ గూండాలు దాడి చేయడం సిగ్గు చేటు. ఇదేమిటని ప్రశ్నిస్తే… బాధితులపైనే హత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణం. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు కబ్జాదారులకు, గూండాలకు అడ్డాలుగా మారాయి. సామాన్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ స్టేషన్లు… సంఘ విద్రోహ శక్తులకు, లంగా దందాలు చేసే వాళ్లకు అడ్డాలైనాయి. రజకార్ల పాలన ఇట్లనే ఉంటదని కేసీఆర్ చెబుతున్నాడు. నిన్న హడావుడిగా సీఎం కేసీఆర్ ఏదో పిడుగు పడ్డట్లు… దేశమే కదిలిపోతదన్నట్లు…ఆకాశం ఊడిపడుతున్నట్లు ఆగమేఘాల మీద మంత్రులను ఫాంహౌజ్ కు పిలిపించుకున్నాడు. యాసంగి వడ్ల కొనుగోలు విషయంలో ఢిల్లీకి మంత్రులందరినీ వెంటబెట్టుకుపోయి కేంద్రాన్ని నిలదీస్తడట. ధర్నాలు చేస్తడట.. సిగ్గుండాలె… ఇలాంటి అబద్దాలు చెప్పడానికి. అసలు కేసీఆర్ మనిషేనా? అది నాలుకా తాటిమట్టా? కేసీఆర్ ను నేనడుగుతున్నా… అసలు ఎందుకీ డ్రామాలు? కేంద్రం యాసంగి బియ్యం కొనడం లేదని మీతో ఎవరు చెప్పారు. పోయినసారి కూడా ఇలానే అన్నావ్. వడ్లు కొనకపోతే పార్లమెంట్ ముందు, ఇండియా గేట్ ముందు, బీజేపీ ఆఫీస్ ముందు ఆ వడ్లన్నీ పారబోస్తానంటివి? ఏమైంది? పారబోయడానికి నీ దగ్గర వడ్లుంటే కదా… నీ దగ్గరున్నవన్నీ కేంద్రం కొంటూనే ఉంది కదా… ఇప్పటి వరకు నువ్వు ఇస్తానన్న బియ్యమే ఇంతవరకు ఇయ్యలేదు? సిగ్గుండాలె మళ్లా ఈ విషయం గురించి మాట్లాడటానికి అని విమర్శించారు బండి సంజయ్.

యాసంగిలో తెలంగాణలో పండిన ప్రతి గింజ కొంటామని పోయినసారి నిండు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించిన సంగతి కేసీఆర్ కు గుర్తు లేదా? అయినా మళ్లీ ఎందుకీ వేషాలు? పోయినసారి పార్లమెంట్ లో ఇదే డ్రామాలాడి పరువు తీసుకున్న సంగతి మర్చిపోయినట్లున్నారు కేసీఆర్ అని అన్నారు బండి సంజయ్.

హుజూరాబాద్ ఎన్నికల టైంలో ఇలానే ప్రజలను మోసం చేయాలని చూశావు. కేంద్రం వడ్లు కొనడం లేదని అన్నావు. యాసంగిలో వరి వేస్తే ఊరే గతి అన్నావు. మరి వరి వేయకుంటే ఏ పంట వేయాలో చెప్పమంటే ఎందుకు చెప్పలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. హుజూరాబాద్ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా బుద్ది తెచ్చుకోలేదు. పైగా యాసంగిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు మూసేస్తున్నట్లు ప్రకటించారు. రైతుల పండించే వరి పంటను రాష్ట్ర ప్రభుత్వం సేకరించబోదని చెప్పావు. మళ్లీ ఏంటీ నాటకాలు? కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత యూపీఏ ప్రభుత్వ హయాంలో కంటే రెట్టింపు సంఖ్యలో తెలంగాణ నుండి బియ్యం సేకరిస్తోంది. అత్యధిక ధాన్యం కొంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఇది నా మాట కాదు.. ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయి. గత ఏడేళ్లలో 84,125 కోట్లు బియ్యం సేకరణ కోసమే కేంద్రం తెలంగాణకు చెల్లించింది. అంతేకాదు.. తెలంగాణలో పండించిన ప్రతి బియ్యం గింజ కొంటామని కూడా కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం అడగగానే అదనపు బియ్యం కూడా కొనేందుకు కూడా సిద్దమైంది. ఇంతకంటే ఇంకేం కావాలి? అయినా ఎందుకీ డ్రామాలు? విజ్ఞులైన ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరుతున్నా అన్నారు బండి సంజయ్.