జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జిల్లా రవాణా శాఖ అధికారి (DTO) బి. వెంకన్న మృతి చెందారు. బొగ్గు లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ అదుపు తప్పి ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఉదయం గణపురం మండలం చెల్పూరు సమీపంలో RTA అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా రవాణా అధికారి వెంకన్న ఇతర సిబ్బందితో కలిసి విధుల్లో నిమగ్నమై ఉండగా, వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఆయనను ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ఆయన మృతి చెందారు.
పోలీసుల కథనం ప్రకారం.. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఒక హార్వెస్టర్‌ను అధికారులు ఆపి తనిఖీ చేశారు. అనంతరం వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్న సమయంలో వెంకన్న వేగంగా వస్తున్న లారీని గమనించి డ్రైవర్‌కు వేగం తగ్గించాలని సూచించారు. అయితే డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో లారీ నేరుగా అధికారిని ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుండగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర విచారణకు ఆదేశించారు. ప్రమాదంలో క్రిమినల్ నిర్లక్ష్యం లేదా ఇతర కోణాలు ఉన్నాయా అనే అంశాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో ఉన్న అధికారి మృతి పట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే ప్రమాదంపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనతో రవాణా శాఖ ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కొందరు ఉద్యోగులు ఇది కేవలం ప్రమాదం కాదని, అన్ని కోణాల్లో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
