Telangana Bill Passed : తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, వేలాది మంది బలిదానాల ఫలితం ‘ది బిల్ ఈజ్ పాస్డ్’ (The Bill is Passed) అనే నాలుగు ముక్కల మాటతో సాకారమైంది. సరిగ్గా 12 ఏళ్ల క్రితం, 2014 ఫిబ్రవరి 20న భారత పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది.
తెలంగాణ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ, రాజ్యసభలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఫిబ్రవరి 20న మధ్యాహ్నం రాజ్యసభలో చర్చ ప్రారంభమైనప్పుడు సీమాంధ్ర ఎంపీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సభలో గందరగోళం నెలకొన్నప్పటికీ, అప్పటి కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో బిల్లును ఓటింగ్‌కు పెట్టింది. చివరకు సాయంత్రం వేళ అప్పటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పి.జె. కురియన్ “The Bill is Passed” అని ప్రకటించడంతో తెలంగాణ ప్రజల కల నిజమైంది. దశాబ్దాల నాటి ఆకాంక్ష నెరవేరిన క్షణాన ఢిల్లీ నుంచి గల్లీ దాకా సంబరాలు మిన్నంటాయి.
ఉద్యమకారుల భావోద్వేగం.. నీళ్లు, నిధులు, నియామకాలు
బిల్లు పాస్ అయినట్లు వార్త తెలియగానే తెలంగాణ వ్యాప్తంగా భావోద్వేగపూరితమైన వాతావరణం నెలకొంది. 1969 ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం వరకు ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల కళ్లు చెమర్చాయి. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజలు వీధుల్లోకి వచ్చి మిఠాయిలు పంచుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో సాగిన పోరాటంలో ఇదొక మైలురాయిగా నిలిచింది. పద్నాలుగేళ్ల పాటు ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ సహా పలువురు నేతలు ఆ క్షణాన అత్యంత భావోద్వేగానికి లోనయ్యారు.
జూన్ 2వ తేదీన నూతన రాష్ట్ర ఆవిర్భావం
రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత మార్చి 1వ తేదీన అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బిల్లుపై రాజముద్ర వేశారు. దీంతో తెలంగాణ ఏర్పాటుకు చట్టపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం జూన్ 2, 2014ను ‘అపాయింటెడ్ డే’గా ప్రకటించింది. ఆ రోజున దేశంలో 29వ రాష్ట్రంగా (ప్రస్తుతం 28) తెలంగాణ అధికారికంగా ఆవిర్భవించింది. ఇప్పుడు ఆ చారిత్రక ఘట్టానికి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆనాడు రాజ్యసభలో జరిగిన ఉత్కంఠభరిత పోరాటాన్ని తెలంగాణ సమాజం మరోసారి గుర్తుచేసుకుంటోంది.
