తెలంగాణలో ఇటీవల నిర్వహించిన మద్యం దుకాణాల టెండర్ లక్కీ డ్రాలో ఒక ప్రభుత్వ ఉద్యోగి పాల్గొనడం పెద్ద వివాదంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 26న జరిగిన లక్కీ డ్రాలో అనేక మంది దరఖాస్తుదారుల్లో మహబూబ్‌నగర్ జిల్లా రాంనగర్ బాలిక ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న పుష్ప అనే ఉపాధ్యాయురాలు కూడా ఉండడం సంచలనం రేపింది. రూ.3 లక్షల డిపాజిట్ చెల్లించి ధర్మాపూర్ వైన్స్ టెండర్‌కు ఆమె దరఖాస్తు చేసుకుంది. అదృష్టం కలిసొచ్చి డ్రాలో ఆమె పేరు ఎంపికైంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన డ్రాలో షాపు కేటాయించబడడంతో ఆమె పత్రాలపై సంతకాలు చేసి టెండర్‌ను ఖరారు చేసుకున్నారు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేసి సంబరాలు జరుపుకున్నారు.
India vs Australia: టీమిండియాపై టిమ్ డేవిడ్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం!
అయితే ఈ సంఘటన కాస్త రాజకీయ, సామాజిక వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన పుష్ప మద్యం వ్యాపారంలో పాల్గొనడం సరికాదని అనేక మంది అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సర్వీసు నియమాల ప్రకారం ఏ ఉద్యోగి అయినా వ్యాపార లేదా టెండర్ కార్యకలాపాలలో పాల్గొనరాదని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. అయినప్పటికీ ఆమె లీవ్ తీసుకుని కూడా మద్యం షాపు టెండర్‌లో పాల్గొనడం తగదని విమర్శలు వెల్లువెత్తాయి. స్థానిక వ్యాపారులు, పౌరులు దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో ఆమె నిజంగా సెలవుపై ఉండి టెండర్ ప్రక్రియలో పాల్గొన్నట్లు తేలింది.
Vijay Karur Stampede : నటుడు విజయ్ పై ఉదయనిధి స్టాలిన్ సంచలన ఆరోపణలు!
దీంతో జిల్లా విద్యాశాఖ అధికారి పీఈటీ పుష్పపై తక్షణ సస్పెన్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు ఆమెను విధుల నుండి తప్పించారు. ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రజలలో మిశ్రమ ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమెపై చర్యలు సరైనవేనని చెప్పగా, మరికొందరు “పాపం అదృష్టం కలిసొచ్చినా ఉద్యోగం పోయే పరిస్థితి తెచ్చుకుంది” అని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సంఘటన ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యాపారాల్లో పాల్గొంటే ఎదురయ్యే పరిణామాలకు మరోసారి ఉదాహరణగా నిలిచింది.
