kavitha: ఎన్నికల సంఘానికి కల్వకుంట్ల కవిత కీలక లేఖ

తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీని స్థాపించిన కల్వకుంట్ల కవితకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. కొత్త పార్టీకి సంబంధించిన పేరుపై అభ్యంతరాలు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం కవితకు లేఖ రాసింది. తాజాగా కవిత తరఫున తెలంగాణ రక్షణ సేన ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తమ తెలంగాణ రక్షణ సేన పార్టీకి (ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 సెక్షన్ 29A కింద) గుర్తింపు ఇవ్వాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం […]

Published By: HashtagU Telugu Desk
Kalvakuntla Kavitha's key letter to the Election Commission

Kalvakuntla Kavitha's key letter to the Election Commission

తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీని స్థాపించిన కల్వకుంట్ల కవితకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. కొత్త పార్టీకి సంబంధించిన పేరుపై అభ్యంతరాలు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం కవితకు లేఖ రాసింది. తాజాగా కవిత తరఫున తెలంగాణ రక్షణ సేన ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తమ తెలంగాణ రక్షణ సేన పార్టీకి (ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 సెక్షన్ 29A కింద) గుర్తింపు ఇవ్వాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు పంపించిన లేఖకు ఆమె తరఫున సమాధానమిచ్చారు. తమ పార్టీ పేరును కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించిందని.. ఈసీ ఆమోదించడంతో తాము సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకున్నామని లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు పార్టీ పేరును మార్చుకోవాలంటే అది తీవ్ర నష్టం, అన్యాయం చేసినట్లే అన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం తమ పార్టీ రిజిస్ట్రేషన్‌పై దాదాపు వెయ్యి అభ్యంతరాలు వచ్చాయని తెలిపిందని.. కానీ ఆ అభ్యంతరాలు ఎవరు తెలిపారు.. ఏ విషయాలు ప్రస్తావించారనే వివరాలు మాత్రం ఇవ్వలేదని కవిత అన్నారు. ఈసీకి వచ్చిన అభ్యంతరాలను తమకు పంపకుంటే.. తాము సమాధానం ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. ఎవరైనా కావాలనే ప్లాన్‌ ప్రకారం గ్రూపులుగా ఏర్పడి ఇదంతా చేయించారా అనేది తెలియాలంటే తమకు అభ్యంతరాల కాపీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రస్తావించారు. తమ పార్టీ పేరుపై వచ్చిన అన్ని అభ్యంతరాల కాపీలను ఇవ్వాలని కవిత లేఖలో కోరారు. ఇప్పుడు పేరు మార్చమని చెప్పడం అన్యాయమని.. గతంలో తెలంగాణకు సంబంధించి ఒకే రకమైన పేర్లతో పార్టీలకు గుర్తింపు ఇచ్చారని.. అలాంటప్పుడు తమ పార్టీపై అభ్యంతరాలు ఎందుకు అని ప్రశ్నించారు. తమ పార్టీపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, సమాధానం ఇచ్చేందుకు తగిన సమయం ఇచ్చాకే వ్యక్తిగత విచారణకు పిలవాలని లేఖలో కోరారు.

ఇటీవల కవిత కొత్తగా స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరుపై తమకు భారీగా ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. టీఆర్‌ఎస్‌ బదులుగా ప్రత్యామ్నాయ పేర్లు సూచించాలని లేఖలో కోరింది. మరోవైపు కవిత పార్టీ పేరు అంశంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రక్షణ సమితి పేరు తన పార్టీకి కేటాయించాలని కోరగా.. ఈసీ నోటీసుకు సరైన రీతిలో సమాధానం చెప్పాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈసీకి సమాధానం ఇచ్చిన తర్వాతే కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఈ పిటిషన్‌ విచారణ చేపట్టడమంటే ఈసీ విధుల్లో జోక్యం చేసుకోవడమేనని అంది. ఈ మేరకు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ రక్షణ సేన లేఖ రాసింది.

 

  Last Updated: 13 Jul 2026, 09:25 AM IST