న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రాంగణంలో ఫిర్యాదుదారులు కూర్చుని వేచి ఉండే అత్యంత కీలకమైన ప్రాంతంలోకి మూడు ప్రమాదకరమైన నాగుపాము పిల్లలు అకస్మాత్తుగా రావడం తీవ్ర కలకలం రేపింది.
పోలీసు సిబ్బంది, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు నిత్యం వందలాది మంది బాధితులు వివిధ సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు వస్తుంటారు. ఎప్పటిలాగే బాధితులు స్టేషన్ ఆవరణలోని వెయిటింగ్ ఏరియాలో కూర్చుని ఉండగా.. పక్కనే ఉన్న ఖాళీ స్థలం నుంచి మూడు నాగుపాము పిల్లలు జరజరా పాకుకుంటూ లోపలికి వచ్చాయి. ఫిర్యాదుదారులు కూర్చునే కుర్చీల కిందకు అవి వెళ్లడంతో అక్కడున్న వారు ఒక్కసారిగా కేకలు వేస్తూ.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరిగెత్తారు.
సమాచారం అందుకున్న పోలీస్ అధికారులు తక్షణమే స్పందించారు. అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. చాకచక్యంగా ఆ మూడు నాగుపాము పిల్లలను ఒక ప్లాస్టిక్ బకెట్‌లో బంధించి మూత పెట్టారు. అనంతరం నగరంలోని ప్రముఖ జంతు సంరక్షణ సంస్థ ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ’ ప్రతినిధులకు సమాచారం అందించారు. స్టేషన్‌కు చేరుకున్న స్నేక్ క్యాచర్స్ ఆ పాములను సురక్షితంగా స్వాధీనం చేసుకుని, జనావాసాలకు దూరంగా ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. సమయానికి పాములను గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మూడేళ్ల క్రితం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు అనుబంధంగా ఈ మధురానగర్ పోలీస్ స్టేషన్‌ను ఒక తాత్కాలిక ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎస్‌ఐఐటీకి చెందిన ఒక భారీ ఖాళీ స్థలాన్ని పోలీస్ స్టేషన్ అవసరాల కోసం ప్రస్తుతం వినియోగిస్తున్నారు. వివిధ రకాల క్రైమ్ కేసుల్లో, ప్రమాదాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న వందలాది ద్విచక్ర వాహనాలు, కార్లను ఈ ఖాళీ స్థలంలోనే పార్క్ చేస్తున్నారు. అయితే సరైన నిర్వహణ లేకపోవడంతో.. ఆ ఖాళీ స్థలం అంతా పిచ్చి మొక్కలు, దట్టమైన చెట్లు, పొదలతో నిండిపోయి ఒక చిన్నపాటి అడవిని తలపిస్తోంది.
ఈ దట్టమైన పొదలు, పాత వాహనాల నిలువ కారణంగా ఇక్కడ పాములకు సురక్షిత ఆవాసాలు ఏర్పడ్డాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా పలుమార్లు పెద్ద పెద్ద సర్పాలు స్టేషన్ లోపలికి, రైటర్ రూమ్‌ల వైపు వచ్చాయని సిబ్బంది చెబుతున్నారు. దీనికి తోడు పీఎస్ ఆవరణలో వీధికుక్కలు కూడా గుంపులు గుంపులుగా తిరుగుతుండటంతో అర్ధరాత్రి వేళల్లో స్టేషన్‌కు వచ్చే మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పీఎస్ ఆవరణలోని పొదలను తక్షణమే శుభ్రం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
