MP Putta Mahesh Kumar: మొయినాబాద్ ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన డ్రగ్స్ పార్టీ ఉదంతం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ కేసులో తెలంగాణ ఈగల్ టీమ్ దాడులు, అరెస్టుల కంటే.. జరుగుతున్న ప్రచారంపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఏలూరు ఎంపీ, యువ నేత పుట్టా మహేష్ యాదవ్‌ను ఈ కేసులోకి లాగడం వెనుక ఒక వ్యవస్థీకృత రాజకీయ కుట్ర దాగి ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి.
టెస్టుల ఫలితాల్లో గందరగోళం.. మతలబు ఎక్కడ?
ఈ కేసులో అత్యంత విచిత్రమైన అంశం ఎంపీ మహేష్ యాదవ్‌కు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షలు. తొలుత నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు ‘నెగెటివ్’ అని తేలింది. కానీ, కొద్ది గంటల వ్యవధిలోనే మళ్ళీ పరీక్షలు నిర్వహించి ‘పాజిటివ్’ వచ్చిందని ప్రకటించడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే వ్యక్తికి గంటల వ్యవధిలో ఫలితాలు మారడం వెనుక ఎవరి ఒత్తిడి ఉంది? నివేదికలను ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Also Read: సంతోషం అనేది కేవలం మనసుకి సంబంధించిన విషయమే కాదంట!
ఎదిగే బీసీ నేతపైనే కక్షా?
పుట్టా మహేష్ యాదవ్ యాదవ సామాజిక వర్గానికి చెందిన బలమైన బీసీ నాయకుడు. తొలిసారి ఎంపీగా ఎన్నికైనప్పటికీ ఏలూరు పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి పనులతో ఆయన దూసుకుపోతున్నారు. అనతి కాలంలోనే ప్రజల్లో సంపాదించుకున్న ఆదరణ, పార్టీలో ఆయన ప్రాధాన్యత పెరగడాన్ని ప్రత్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారనే వాదన వినిపిస్తోంది. రాజకీయంగా ఎదుర్కోలేక, ఇలాంటి కేసుల సాకుతో ఒక బీసీ నేత రాజకీయ భవిష్యత్తును చిదిమేయాలని చూస్తున్నారా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసలు నిందితులను వదిలేసి.. మహేష్‌పైనే ఫోకసా?
ఈ ఫామ్‌హౌస్ ఘటనలో అనేక తీవ్రమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పీఏ తన ఫోన్‌ను పగలగొట్టి ఆధారాలు ధ్వంసం చేయడంపై దర్యాప్తు ఎటు సాగుతోంది? గతంలోనూ డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న రోహిత్ రెడ్డి వంటి వారి పేర్లను పక్కన పెట్టి, కేవలం మహేష్ యాదవ్‌ను మాత్రమే వైసీపీ నేతలు టార్గెట్ చేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కీలక నిందితుల విషయంలో మౌనంగా ఉంటూ, కేవలం ఒక బీసీ ఎంపీని బ్లేమ్ చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రత్యర్థులు చూస్తున్నట్లు స్పష్టమవుతోంది.
విచారణ తేలకముందే సోషల్ మీడియా దాడి
ఏదైనా కేసులో విచారణ పూర్తికాకుండా కోర్టు తీర్పు వెలువడకుండా ఒక వ్యక్తి ప్రతిష్టను దిగజార్చడం ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదు. మహేష్ యాదవ్ తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ, పనిగట్టుకుని ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం హీనమైన చర్యగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
