Telangana Secretariat : ఇటీవల తెలంగాణ సచివాలయం వద్ద ఉంటున్న బెటాలియన్ కానిస్టేబుళ్లను తొలగించిన విషయం తెలిసిందే. దీంతో ఈరోజు తెలంగాణ సచివాలయం భద్రత బాధ్యతలను తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (టీజీఎస్పీఫ్) స్వీకరించింది. సచివాలయ భద్రత పర్యవేక్షణ అధికారిగా దేవిదాస్ నియమితులయ్యారు. ఆయన ఆధ్వర్యంలో నేడు సచివాలయ ఆవరణలో పూజలు నిర్వహించి బందోబస్తు బాధ్యతలను చేపట్టారు. ఈ మేరకు మొత్తం 214 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది రక్షణ బాధ్యతలను చేపట్టారు.
ఇకపోతే..సచివాలయాన్ని ప్రారంభించిన తర్వాత మొదటగా ఎస్పీఎఫ్‌కే భద్రత బాధ్యతలు అప్పగించారు. అయితే 2023 ఏప్రిల్ 25న భద్రత నిర్వహణను తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) లేదా బెటాలియన్ పోలీసులకు అప్పగించారు. భద్రతతో పాటు అగ్నిప్రమాదాల నుంచి రక్షణ లాంటి ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్న ఎస్పీఎఫ్‌నకు సచివాలయంలో భద్రత బాధ్యతలు అప్పగించాలని డీజీపీ ఆగస్టు 5న రాష్ట్ర సర్కార్‌కు ప్రతిపాదన పంపారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న రేవంత్ సర్కార్.. ఇకనుంచి టీజీఎస్పీ భద్రత బాధ్యతలు ఎస్పీఎఫ్ నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు.
ఇటీవల ఏక్ పోలీస్ విధానం అమలు కోసం టీజీఎస్పీ కానిస్టేబుళ్లు, వారి కుటుంబాలు ధర్నాలు చేస్తుండటంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. ముఖ్యమంత్రి నివాసం, కార్యాలయం, సచివాలయం వద్ద విధుల్లో ఉన్న టీజీఎస్పీ కానిస్టేబుళ్లు ధర్నా చేస్తే అటు పరువు పోవడంతోపాటు ఇటు భద్రతకు ముప్పు కలుగుతుందని ప్రభుత్వం భావించింది. వెంటనే టీజీఎస్పీని పక్కకు తప్పించింది. మొదట సీఎం నివాసం, ఇంటివద్ద రక్షణను ఎస్పీఎఫ్‌కు అప్పగించింది. తాజాగా సచివాలయాన్ని సైతం ఎస్పీఎఫ్ పరిధిలోకి తీసుకెళ్లింది. కాగా, ఈ ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో పోలీస్ ఇప్పటిదాకా 49 మందిని సస్పెండ్ చేసింది. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. అంతేకాక.. బెటాలియన్ కానిస్టేబుళ్ల సెలవుల రద్దును ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.
Read Also Jharkhand : జార్ఖండ్ ఎన్నికలు.. కాంగ్రెస్ విజయం ఖాయం: భట్టి విక్రమార్క: