Site icon HashtagU Telugu

Smita Sabharwal : సిన్సీయర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్‌‌.. ‘కాళేశ్వరం’ విషయంలో మీడియా ఓవర్ యాక్షన్

Smita Sabharwal Telangana Ias Kaleshwaram Project Kaleshwaram Judicial Commission

Smita Sabharwal : స్మితా సబర్వాల్..  తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారి మాత్రమే కాదు.. సిన్సీయర్ ఐఏఎస్ అధికారిణి కూడా!! పీపుల్ ఫ్రెండ్లీగా మెలిగే రాష్ట్ర ఐఏఎస్‌లలో ఆమె ముందు వరుసలో ఉంటారని నిస్సందేహంగా చెప్పొచ్చు.  ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ.. వాటికి పరిష్కారాలను చూపుతూ.. పేదలకు సాయపడుతూ స్మితా సబర్వాల్ మంచి పేరు సంపాదించుకున్నారు.  2001లో ట్రైనీ కలెక్టర్‌గా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె.. గత 23 ఏళ్లుగా అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ పేరు ప్రతిష్ఠలను కూడగట్టుకున్నారు. వాటిని దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఇటీవలే తెలుగు మీడియాలో వచ్చిన కథనాలను బట్టి తేటతెల్లం అవుతోంది.

Also Read :Daaku Maharaj : ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో, ఏపీలో.. ఎప్పుడో తెలుసా?

గత బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణకు కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్‌ను కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేసింది. తాజాగా డిసెంబరు నెల మూడోవారంలో కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఎదుట విచారణకు హాజరైన వారిలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కూడా ఉన్నారు.  అప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులోని వివిధ వ్యవహారాలతో ఆమెకు ముడిపెడుతూ తప్పుడు కథనాలను పలు మీడియాలలో ప్రచురించారు. అయితే అసలు వాస్తవాలు అందుకు పూర్తి భిన్నమైనవి. తప్పుడు ప్రచారంతో పలు మీడియా సంస్థలు ఓవర్ యాక్షన్ చేస్తున్నాయని ప్రజలు అంటున్నారు. సిన్సీయర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌పై మీడియా ట్రయల్ జరుగుతోందని నెటిజన్ల మధ్య చర్చ జరుగుతోంది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఈవిధమైన ప్రచారం చేయడాన్ని అందరూ తప్పుపడుతున్నారు.

Also Read :Naga Vamsi : దిల్ రాజు వచ్చాకే మీటింగ్ పెట్టుకొని డిసైడ్ అవుతాం.. సీఎం కామెంట్స్ పై నాగవంశీ..

స్మితా సబర్వాల్ ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు స్వయంగా సీఎం కేసీఆర్ ఆమెను సీఎంఓకు పిలిపించారు. ప్రజలకు సన్నిహితంగా పాలనను నడిపించగల ఆమె సామర్థ్యాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఆనాడు కేసీఆర్ ఆమెకు సీఎంఓలో అవకాశాన్ని కల్పించారు. తనకు పర్సనల్ సెక్రెటరీ‌గా వ్యవహరించే ఛాన్స్‌ను స్మితకు కేటాయించారు. కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టేలా స్మిత అప్పట్లో అద్భుతంగా పనిచేశారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల విషయంలో స్మితా సబర్వాల్ పాత్ర చాలా పరిమితం. ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఏవైనా తప్పిదాలు జరిగితే.. ఆ సమాచారాన్ని సీఎం కేసీఆర్‌కు అందించడానికి ఆమె పరిమితం అయ్యేవారు. ఈవిషయాలను తెలుసుకోకుండా.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో  స్మితా సబర్వాల్‌ది కీలక పాత్ర అన్నట్టుగా మీడియాలో తప్పుడు కథనాలు రాస్తున్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు నాటి తెలంగాణ ప్రభుత్వ సీఎస్ ఎస్‌కే జోషి, ఇరిగేషన్ శాఖ సెక్రెటరీ రజత్ కుమార్, ఫైనాన్స్ శాఖ సెక్రెటరీ రామక్రిష్ణారావుల కనుసన్నల్లో జరిగాయి. నిర్మాణ వ్యయం, కాంట్రాక్టులు, నిధుల కేటాయింపు వంటివన్నీ వారి పరిధిలోనే జరిగిపోయాయి.  ఎస్‌కే జోషి, రజత్ కుమార్, రామక్రిష్ణారావులు సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ప్రాజెక్టు పనులను పూర్తి చేయించారు. ఈక్రమంలో ఎక్కడా స్మితా సబర్వాల్ పాత్ర నేరుగా లేనే లేదు. ప్రాజెక్టు విషయంలో ఆమె ఎలాంటి అధికారిక నిర్ణయాలను కూడా తీసుకోలేదు.

ఆరు రోజులే ఇరిగేషన్ సెక్రెటరీగా స్మిత..

అయితే ఇరిగేషన్ శాఖ సెక్రెటరీ రజత్ కుమార్ రిటైరయ్యాక.. 2023 నవంబరు 30 నుంచి 2023 డిసెంబరు 6 వరకు కేవలం ఆరు రోజులే ఇరిగేషన్ సెక్రెటరీగా స్మిత(Smita Sabharwal) సేవలు అందించారు. ఆ ఆరు రోజుల్లో ఆమె ఎలాంటి ముఖ్య నిర్ణయాలను కూడా తీసుకోలేదు. ఇక 2023 డిసెంబరు 7న తెలంగాణలో సీఎం  రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైంది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం స్మితా సబర్వాల్‌‌ను తెలంగాణ ఫైనాన్స్ కమిషన్‌‌కు బదిలీ చేశారు. అనంతరం కొన్ని నెలలకే రాష్ట్ర టూరిజం శాఖకు సెక్రెటరీగా ఆమెను బదిలీ చేశారు. ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికల డ్యూటీకి స్మితా సబర్వాల్ వెళ్లి వచ్చారు. తనకు అప్పగించిన టూరిజం శాఖకు వన్నె తెచ్చే కీలకమైన పనిని ఆమె చేశారు. తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి టూరిజం పాలసీని తయారు చేశారు. ఆ శాఖను తనకు అప్పగించిన మూడు నెలలలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసి సీఎం రేవంత్‌తో శభాష్ అనిపించుకున్నారు. స్మితా సబర్వాల్ అంకితభావం ఎలా ఉంటుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏ శాఖను అప్పగించినా.. దానికి ప్రత్యేక గుర్తింపును తేవడమే లక్ష్యంగా ఆమె పనిచేస్తుంటారు.