తెలంగాణలో పత్తి సీజన్ ప్రారంభమైన వేళ, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) విధించిన కొత్త నిబంధనలు రైతుల్లో తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. ఎకరానికి కేవలం ఏడు క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేయాలన్న సీసీఐ నిర్ణయంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. రైతులకు న్యాయం జరిగేలా కేంద్రం వెంటనే ఈ నిబంధనను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సీసీఐ మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కుమార్ గుప్తాలకు తుమ్మల లేఖ రాశారు. పత్తిలో తేమ శాతం 8–12% వరకు మాత్రమే అనుమతిస్తామన్న పరిమితిని కనీసం 20% వరకు పెంచాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.
HYD -Bijapur Highway : ఇది దారి కాదు..యమలోకానికి రహదారి
తుమ్మల తన లేఖలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై గట్టిగా విమర్శలు చేశారు. అమెరికా ఒత్తిడులకు లోనై పత్తి దిగుమతి సుంకాలను ఎత్తివేయడం వల్ల దేశీయ మార్కెట్లో రైతులు గిట్టుబాటు ధర పొందలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం రైతులపై అదనపు ఆంక్షలు విధించడం మరింత అన్యాయమని అన్నారు. రాష్ట్రంలో ఎకరాకు సగటున 15 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వస్తుంటే, ఒక్కో రైతు నుంచి కేవలం 7 క్వింటాళ్ల వరకు మాత్రమే కొనుగోలు చేయమన్న సీసీఐ ఆదేశం రైతుల కష్టాలను రెట్టింపు చేస్తోందన్నారు. అంతేకాదు, “కిసాన్ కపాస్ యాప్‌లో తప్పనిసరి నమోదు”, “జిన్నింగ్ మిల్లులను L1, L2 కేటగిరీలుగా విభజించడం” వంటి విధానాలు రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని తెలిపారు. ఇదే సీజన్‌లో కొన్ని కేంద్రాల్లో ఒక్కో రైతు నుంచి 12 క్వింటాళ్లు కొనుగోలు చేసిన సీసీఐ, ఇప్పుడు అకస్మాత్తుగా పరిమితులు పెట్టడం అవాస్తవమని తుమ్మల లేఖలో పేర్కొన్నారు.
PM Kisan : రైతులకు బిగ్ షాక్ ఇచ్చిన మోడీ
ఇక జిన్నింగ్ మిల్లుల యజమానులు కూడా ఈ ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కాటన్ జిన్నింగ్ మిల్లర్ల, వ్యాపారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి, మంత్రి తుమ్మలను కలసి సీసీఐ ఆంక్షలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నవంబర్ 7 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల కేంద్ర ప్రభుత్వాన్ని తక్షణం జోక్యం చేసుకుని, రైతుల సమస్యలతో పాటు జిన్నింగ్ మిల్లర్ల సమస్యలను కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పత్తి రైతులు ఈ నిర్ణయం వెనక్కి తీసుకుంటేనే తమకు ఊరట కలుగుతుందని ఆశిస్తున్నారు.
