Hyderabad Restaurants : ఛీఛీ.. హైదరాబాద్ హోటళ్ల‌పై రైడ్స్.. దారుణాలు వెలుగులోకి

మార్చి 21వ తేదీనే హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఉన్న వరలక్ష్మి టిఫిన్స్‌లో(Hyderabad Restaurants) ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు.

Published By: HashtagU Telugu Desk
Serious Unhygienic Restaurants In Hyderabad Unsafe Food

Hyderabad Restaurants : హైదరాబాద్‌లోని హోటల్స్ అనగానే మనకు ధరల దడ మొదలవుతుంది. రేట్లు అంతగా ఉంటాయి మరి. అయితే క్వాలిటీ మాత్రం అంతంత మాత్రం. అంతేకాదు.. చాలావరకు హోటళ్ల నిర్వహణ దారుణంగా ఉంటుంది. వంటశాలల నిర్వహణ అధ్వానంగా ఉంటుంది. వాటిని చూస్తే.. మరోసారి హోటళ్లలో భోజనం చేయడానికి మనసొప్పదు. తాజాగా ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు హైదరాబాద్‌‌లోని పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను పాటిస్తున్నారా లేదా అనేది తనిఖీ చేశారు. దీంతో విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటిని ట్విట్టర్ వేదికగా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం వెల్లడించింది.

Also Read :Bulldozers Action : నాగ్‌‌పూర్ అల్లర్ల నిందితుడి‌ ఇంటిపై బుల్డోజర్‌ యాక్షన్‌

మాదాపూర్‌లోని క్షత్రియ ఫుడ్స్‌లో..

హైదరాబాద్ నగరంలోని మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉన్న పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు.మార్చి 21న మాదాపూర్‌లో ఉన్న క్షత్రియ ఫుడ్స్‌ను తనిఖీ చేశారు. దానిలో పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేదని అధికారులు గుర్తించారు.  కాల్వల్లో మురుగు నీరు నిల్చి ఉన్నట్లు తేలింది. టైల్స్ పగిలిపోయి, అపరిశుభ్రమైన చిమ్నీలతో, ఆహార వ్యర్థాలతో నిండిన మురికి  కాల్వలతో ఈ హోటల్ దారుణంగా ఉందని అధికారులు తేల్చారు. కూరగాయలు తరిగే ప్రదేశంలో పెద్దసంఖ్యలో ఈగలు ఉన్నాయి. అపరిశుభ్ర ప్రదేశంలో ఫ్రిజ్‌ను ఉంచారు. వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్‌ను కలిపి ఫ్రిజ్‌లో ఉంచడం గమనార్హం. ఫ్రిజ్‌లో స్టోర్ చేసిన మాంసానికి లేబుల్ లేదు. ఫ్రిజ్‌లో దాచిన మటన్, చికెన్ నుంచి రక్తం కారుతుండటాన్ని అధికారులు గుర్తించారు. ఈ రెస్టారెంట్‌లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు తేలింది. ఇక్కడి వంటశాలలో పనిచేసే కొందరు హెడ్ క్యాప్స్, గ్లోవ్స్ ధరించడం లేదు. హోటల్ నిర్వాహకుల వద్ద వాటర్ అనాలిసిస్ రిపోర్ట్, పెస్ట్ కంట్రోల్ రికార్డులు, వంట మనుషుల మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేవు.

గచ్చిబౌలిలోని వరలక్ష్మి టిఫిన్స్‌లో..

మార్చి 21వ తేదీనే హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఉన్న వరలక్ష్మి టిఫిన్స్‌లో(Hyderabad Restaurants) ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. దీన్ని నిర్వహిస్తున్న వారి వద్ద కూడా వాటర్ అనాలిసిస్ రిపోర్టు లేదు. వంట మనుషుల మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేవు.  ఈ రెస్టారెంట్‌లో వంట కోసం వాడే ముడి సరుకులను నేరుగా నేలపైనే వేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. హోటల్‌లోని మురికి కాల్వల్లో మురుగు పేరుకుపోయి ఉంది. ఆహార వ్యర్థాలను నేరుగా కాల్వలో వేస్తున్నారు. వాటిని ఎప్పటికప్పుడు తీసేయడం లేదు. ఓపెన్ డస్ట్ బిన్‌లను వాడుతున్నారు. గోడలు అపరిశుభ్రంగా ఉన్నాయి. హోటల్‌లోని ఫ్లోరింగ్ దెబ్బతిని ఉంది. గ్రైండింగ్ ఏరియా అపరిశుభ్రంగా ఉంది. ప్లాస్టిక్ వంటపాత్రలు విరిగి ఉన్నాయి.

కొండాపూర్‌లోని సుబ్బయ్య గారి హోటల్‌లో.. 

మార్చి 20న కొండాపూర్‌లోని సుబ్బయ్యగారి హోటల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ హోటల్ నిర్వాహకుల వద్ద వాటర్ అనాలిసిస్ రిపోర్టు లేదు. పెస్ట్ కంట్రోల్ రికార్డులు వీరి వద్ద అందుబాటులో లేవు. వంట మనుషులకు సంబంధించిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేవు. హోటల్ ప్రాంగణంలో FSSAI Licenseను ఏర్పాటు చేయలేదు. కిచెన్ ఏరియా, హోటల్‌లోని గోడలు చాలా అపరిశుభ్రంగా ఉన్నాయి.ఫ్లోరింగ్ దెబ్బతిని ఉంది. స్టవ్‌లు మురికిగా ఉన్నాయి. వంటపాత్రలు శుభ్రంగా లేవు. ఆహార వ్యర్థాలతో నిండిపోయి మురికి కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. కూరగాయలను నేలపైనే వేసి ఉంచుతున్నారు. స్టోర్ రూం నిర్వహణ దారుణంగా ఉంది. ఈ హోటల్‌లో వినియోగించే వంటనూనెను ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరించారు. ఆయిల్ శాంపిల్‌ను టోటల్ పోలార్ కాంపౌండ్స్ (టీపీసీ) టెస్ట్ కోసం పంపారు. వంటనూనెలో 25 శాతానికి మించి టీపీసీ ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి.

Also Read :Betting App Case : విజయ్ దేవరకొండను అరెస్ట్ చేయాలనీ KA పాల్ డిమాండ్

  Last Updated: 24 Mar 2025, 02:44 PM IST