Old City Hyderabad హైదరాబాద్ పాతబస్తీలోని కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ మూక హల్‌చల్ చేసింది. నిన్న రాత్రి ఒక ముఠా కిరణా దుకాణం వద్ద యువకుడిపై కత్తితో దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఫాతిమా ఆసుపత్రి ప్రాంతంలో రౌడీ షీటర్ అసద్ తన ముఠాతో కలిసి ఖయ్యుం అనే యువకుడిపై దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి. అతడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
బాధితుడు ఖయ్యుం తన సోదరుడి కిరాణా దుకాణంలో సహాయకుడిగా పని చేస్తున్నాడు. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న అసద్ ముఠా దాడికి పాల్పడింది. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసద్‌పై ఒక హత్య కేసు, రెండు హత్యాయత్నం కేసులు, దోపిడీ, దొంగతనం కేసులు నమోదై ఉన్నాయి. 2015-2016 మధ్య అసద్‌పై పీడీయాక్టు పెట్టారు. అసద్, అతని ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు.
