తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ఢిల్లీ పర్యటనలో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు టీడీపీ నేత నారా లోకేష్ (KTR – Naralokesh) మధ్య జరిగిన రహస్య భేటీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్థరాత్రి సమయంలో వీరిద్దరూ కలిసి డిన్నర్ చేసారన్న విషయాన్ని రేవంత్ బయటపెట్టారు. ఈ సమావేశం వెనక అసలు ఉద్దేశం ఏమిటో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి ఇదే విషయాన్ని ఆరోపిస్తూ, జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి ఈ భేటీ జరిగిందని ఆరోపించిన విషయం తెలిసిందే.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో సంభవించిన భేటీనా?
కాంగ్రెస్ వర్గాల ఆరోపణల ప్రకారం.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతివ్వకుండా, టీడీపీ తరఫున మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తే వారినే బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని కేటీఆర్ చెప్పినట్లు ఆరోపిస్తున్నారు. మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్‌లోకి చేరడానికి ముందు టీడీపీకి చెందిన నేత. 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తరువాత పార్టీ మారి బీఆర్ఎస్‌లోకి వెళ్లి రెండుసార్లు గెలిచారు. ఆయన మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉపఎన్నిక ఏర్పడింది. ఈ నేపథ్యంలో టికెట్ ఎవరికి ఇవ్వాలి అన్న దానిపై కేటీఆర్-లోకేష్ భేటీ జరగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బీఆర్ఎస్, టీడీపీ మౌనం – భేటీ నిజమేనా?
ఇంతటి కీలక ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు స్పందించకపోవడం ఆసక్తికరంగా మారింది. కేటీఆర్-లోకేష్ భేటీ వాస్తవమేనా? లేక కాంగ్రెస్ వర్గాల ప్రచారమేనా అన్నది స్పష్టత లేని ప్రశ్నగా మిగిలిపోయింది. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఈ ఆరోపణలపై ఎలాంటి వివరణ రాలేదు. దీనివల్ల రాజకీయ వర్గాల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు ఈ విషయాన్ని ఖండించకపోవడం వల్ల కాంగ్రెస్ ఆరోపణలకు బలం చేకూరుతోంది.
కేసీఆర్ కుటుంబంపై దర్యాప్తులో రాజీ లేదన్న సీఎం రేవంత్
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబంపై కూడా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో విచారణను పారదర్శకంగా చేస్తామని తెలిపారు. నిందితులెవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కిషన్ రెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలోనే అరెస్టులు జరుగుతాయని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలతో రాజకీయ వేడి మరింత పెరిగింది.