దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. జూన్ నెలలో కాస్త మందగించినట్లు కనిపించిన రుతుపవన గమనం ప్రస్తుతం వేగం పుంజుకుంది. రాబోయే 24 గంటల నుంచి 72 గంటల వ్యవధిలో తెలంగాణతో పాటు దేశంలోని మరో 23 రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు ముందస్తు అలర్ట్‌లు జారీ చేసింది. ఈ వారంలో బంగాళాఖాతంలో వరుసగా రెండు శక్తివంతమైన అల్పపీడన ప్రాంతాలు ఏర్పడనున్నాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఇవి మధ్య భారతదేశం గుండా భూభాగంలోకి పయనించే క్రమంలో వాతావరణంలోకి విపరీతమైన తేమను నెట్టివేస్తాయన్నారు.
దీనివల్ల రుతుపవనాలు మరింత బలపడి విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. ముఖ్యంగా జూలై 1 నుంచి జూలై 4 మధ్య దేశవ్యాప్తంగా వానలు దంచికొట్టే అవకాశం ఉండటంతో, ఎండ తీవ్రత తగ్గి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 5 నుంచి 6 డిగ్రీల వరకు పడిపోయి వాతావరణం చల్లబడుతుందని చెప్పారు. నేడు తెలంగాణలోని ఉత్తర, తూర్పు జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉండదని అన్నారు. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మరోవైపు, ముగిసిన జూన్ నెలలో దేశంలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. తెలంగాణలో జూన్ నెలలో మొత్తంగా 12 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో జూన్ సాధారణ వర్షపాతం 13.03 సెం.మీ కురవాల్సి ఉండగా, కేవలం 11.53 సెం.మీ మాత్రమే నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 16 జిల్లాల్లో -20 నుంచి -59 శాతం వరకు లోటు కనిపించింది. అన్నింటికంటే ఎక్కువగా హనుమకొండ జిల్లాలో తీవ్ర వర్షపాత లోటు నమోదైంది. ఈ జిల్లాలో సాధారణ సగటు వర్షపాతం 142.1 మి.మీ కురవాల్సి ఉండగా, కేవలం 40.9 శాతం మాత్రమే వర్షపాతం రికార్డైంది. అంటే ఇక్కడ ఏకంగా 71 శాతం లోటు వర్షపాతం ఉంది. మిగిలిన 12 జిల్లాల్లో మాత్రం సాధారణ వర్షపాతం కంటే కేవలం 17 శాతం మాత్రమే నమోదైంది. అయితే జూలై మొదటి వారంలో కురవబోయే భారీ వర్షాలతో ఈ లోటు అంతా భర్తీ అయి, ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
