తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి (వైటీడీ) రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలక మండలిని ఏర్పాటు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో మొత్తం 18 మంది సభ్యులతో ఈ కమిటీని నియమించింది. బోర్డు ఛైర్మన్‌గా ప్రముఖ ఔషధ రంగ పారిశ్రామికవేత్త, ఎంఎస్‌ఎన్ గ్రూప్ వ్యవస్థాపక సీఎండీ డాక్టర్ మన్నె సత్యనారాయణ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ పాలక మండలిలో సభ్యులుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, ప్రముఖ నటుడు చిరంజీవి అర్ధాంగి కొణిదెల సురేఖకు చోటు కల్పించారు. వారితో పాటు చిలప్పగారి విజయరాజం, తూళ్ల విజయేందర్, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వాతి కాంతమణి, ఎం.రాఘవేంద్ర రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ ఆలయ ఫౌండర్ ట్రస్టీలు సభ్యులుగా నియమితులయ్యారు.
వీరితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, యాదాద్రి జిల్లా కలెక్టర్, వైటీడీఏ వైస్ ఛైర్మన్, ఆలయ ఈవో ఎక్స్-అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు. ఎక్స్-అఫీషియో, ఫౌండర్ ట్రస్టీ సభ్యులు మినహా మిగిలిన వారి పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. ఈ మేరకు దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఛైర్మన్‌గా నియమితులైన మన్నె సత్యనారాయణ రెడ్డికి ఉస్మానియా, పాలమూరు విశ్వవిద్యాలయాల నుంచి రెండు పీహెచ్‌డీలు ఉన్నాయి. ఈయన గతంలో మహబూబ్‌నగర్ ఎంపీగా పనిచేసిన మన్నె శ్రీనివాస్‌రెడ్డికి సోదరుడు.
