ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్ (PV Sunil Kumar Suspend) వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతోంది. చంద్రబాబు నాయుడు (Chandrababu)నేతృత్వంలోని ఏపీ కూటమి ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. సునీల్ కుమార్ ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారని పేర్కొంటూ ఆయన్ను సస్పెండ్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ నిర్ణయంపై తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) తీవ్ర స్థాయిలో స్పందించారు.
సునీల్ కుమార్ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే ఆయనపై కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తగిన అనుమతులు తీసుకుని విదేశాలకు వెళ్లినా, ఇప్పుడు అకస్మాత్తుగా కొత్త నిబంధనలు అమలు చేసినట్లు వ్యవహరించడం తగదని విమర్శించారు. గతంలో ప్రభుత్వమే ఆయనకు ఎక్స్-ఇండియా లీవ్ మంజూరు చేసిందని, అయితే ఇప్పుడు ఆ అనుమతిని లెక్కచేయకుండా సస్పెన్షన్ విధించడం అన్యాయమని తెలిపారు. దీని వెనుక అసలు ఉద్దేశం ఎస్సీ, ఎస్టీ అధికారులను ఎదగనివ్వకుండా చేయడమేనని ఆరోపించారు.
Galwan Clash: భారత సైనికుల దెబ్బతో కోమాలోకి.. ఆ చైనీయుడికి వరుస సత్కారాలు
ప్రభుత్వ అధికారుల విదేశీ పర్యటనలు, టూర్ షెడ్యూళ్ల విషయంలో అసమానతలు ఉన్నాయని, ముఖ్యంగా దావోస్ పర్యటనల విషయంలో ప్రభుత్వ పెద్దల వైఖరిపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. అధికారుల వ్యక్తిగత ఖర్చుతో విదేశాలకు వెళ్లడాన్ని తప్పుపట్టడం వెనుక ఎస్సీ, ఎస్టీ వర్గాలపై కొనసాగుతున్న వివక్ష స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఎస్సీలు, ఎస్టీలు విమానయాన ప్రయాణాలు చేయకూడదా? వారి పిల్లలు విదేశాల్లో చదువుకోకూడదా? అనే విధంగా ప్రభుత్వ వైఖరి ఉందని ఆరోపించారు.
అంతేకాక, హోంమంత్రిగా ఉన్న ఎస్సీ వర్గానికి చెందిన అనిత ఈ అన్యాయంపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అలాగే, ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా మౌనం పాటించడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఆదుకుంటామంటూ ఓట్లు దండుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిజానికి ఈ వర్గాల హక్కులను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. సునీల్ కుమార్‌ను కాదు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలతో సునీల్ కుమార్ వ్యవహారం మరింత రాజకీయ రగడకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.