Site icon HashtagU Telugu

Water Crisis Vs Elections : ఎన్నికల క్షేత్రంలో ‘జల జగడం’.. గ్రేటర్ హైదరాబాద్‌లో ‘త్రి’బుల్ ఫైట్

Water Crisis Vs Elections

Water Crisis Vs Elections

By Dinesh Akula

Water Crisis Vs Elections : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయ పరిణామాలు నాటకీయ మలుపులు తీసుకుంటున్నాయి. నీటి సంక్షోభం ఎన్నికల కేంద్ర బిందువుగా మారుతోంది. ప్రత్యేకించి హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్‌లు నీటి ఎద్దడి సమస్యపై విమర్శలు, ప్రతి విమర్శలతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల క్షేత్రాన్ని(Water Crisis Vs Elections) వేడెక్కిస్తున్నాయి. ఈనేపథ్యంలో హైదరాబాద్ మహా నగరం పరిధిలోని రాజకీయ సమీకరణాలపై ఓ విశ్లేషణ..

We’re now on WhatsApp. Click to Join

ప్రతినెలా 20వేల లీటర్ల నీళ్లు ఫ్రీ..

2023 నవంబరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 21 అసెంబ్లీ స్థానాలకుగానూ 13 కారు పార్టీ కైవసం అయ్యాయి. బీజేపీ ఒక్క సీటు మాత్రమే గెల్చుకోగా, కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఈనేపథ్యంలో బీఆర్‌ఎస్ ఇప్పుడు సికింద్రాబాద్, మల్కాజిగిరి సీట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎలాగైనా లోక్‌సభ ఎన్నికల్లో వాటిని గెల్చుకోవాలని గులాబీ దళం కసరత్తు చేస్తోంది. వీటిని చేజిక్కించుకోవడం ద్వారా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం నీటి కొరత సమస్యను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకుంది. ఈ అంశం హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల ప్రజలను బాగా ప్రభావితం చేయగలదని కారు పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈక్రమంలోనే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. రాష్ట్రంలోని రేవంత్ సర్కారుపై ఎదురుదాడికి దిగారు. నీటిఎద్దడి సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఇటీవల బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం వేదికగా ఆయన మండిపడ్డారు. ఒక మార్చి నెలలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజలు 2.30 లక్షల నీటి ట్యాంకర్లను బుక్ చేసుకున్నారని.. నిత్యావసరమైన నీటి కోసం మహా నగర ప్రజలు భారీగా ఖర్చు పెట్టాల్సి రావడంపై మరో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఆప్ సర్కారు తరహాలో.. హైదరాబాద్ నగరంలోని ప్రజలకు ప్రతినెలా 20వేల లీటర్ల నీటిని ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు.

Also Read :Suryakumar Yadav: ముంబై ఇండియ‌న్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. జ‌ట్టులోకి సూర్య‌కుమార్ యాద‌వ్‌..!

కేటీఆర్ విశ్లేషణ ఇదీ..

హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఒవైసీతో ఢీ..

హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం మజ్లిస్ పార్టీకి కంచుకోట. మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఇక్కడి నుంచి ఈసారి కూడా బరిలోకి దిగారు. ఇక్కడి మైనారిటీ ఓటు బ్యాంకు ఒవైసీ పార్టీకి ఆరో ప్రాణం. మైనారిటీ ఓటు బ్యాంకును తన వైపునకు తిప్పుకునేందుకు ఈసారి టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. అయితే దీనిపై ఇంకా పూర్తి క్లారిటీ లేదు. ఇక ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా పోరాడిన సాంస్కృతిక కార్యకర్త కొంపెల్ల మాధవీ లతను ఈసారి హైదరాబాద్ అభ్యర్థిగా బీజేపీ బరిలోకి దింపింది. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్ వల్ల ఈ స్థానంలో బీజేపీకి కొంత బలం ఉంది.

సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డితో ఢీ..

సికింద్రాబాద్‌లో ప్రస్తుత కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ జి. కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 1991 సంవత్సరం నుంచి ఈ లోక్‌సభ స్థానంలో బీజేపీ మంచి ఫలితాలనే సాధిస్తోంది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే టి పద్మారావు గౌడ్‌‌ను బీఆర్ఎస్ ఖరారు చేసింది. ఇటీవలే బీఆర్‌ఎస్ నుంచి జంప్ అయిన ప్రముఖ రాజకీయ నాయకుడు దానం నాగేందర్‌కు కాంగ్రెస్ టికెట్ దక్కింది. ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. ముగ్గురూ బలమైన అభ్యర్థులే కావడంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.

మల్కాజిగిరిలో సునితా మహేందర్‌రెడ్డితో ఢీ..

మల్కాజిగిరిలోని 7 లోక్‌సభ స్థానాలన్నీ బీఆర్ఎస్ గెల్చుకుంది. దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జి. లాస్య నందిత మరణించారు. స్థానికంగా మంచి పేరున్న సునీతామహేందర్‌రెడ్డికి కాంగ్రెస్‌ టికెట్ లభించింది. ఆమె ఇప్పటికే నామినేషన్‌ వేశారు. గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌పై ఓడిపోయిన ఈటల రాజేందర్‌ను బీజేపీ బరిలోకి దింపింది. ఇక రాగిడి లక్ష్మా రెడ్డికి బీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చింది.

విజేత ఎవరు ?

ఈవిధంగా విభిన్న సమీకరణాలు, ఎత్తులు, పైఎత్తులతో ఈ మూడు లోక్‌సభ స్థానాల్లో రసవత్తర రాజకీయ పోరు జరుగుతోంది. మహా నగరం హైదరాబాద్ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఎవరూ ఊహించలేకపోతున్నారు. మునుపటిలా ఇక్కడ బీఆర్ఎస్‌కే పట్టం కడతారా ? అధికారంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల వైపు మొగ్గుచూపుతారా ? అనేది ఎన్నికల ఫలితాలు వెలువడితేనే తెలుస్తుంది.

Also Read : Garlic: ఆ ఒక్క పని చేస్తే చాలు నెలలపాటు పాడవని వెల్లుల్లి.. అదెలా సాధ్యం అంటే?