Site icon HashtagU Telugu

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సెల్ఫ్ గోల్

Pawan Kalyan Own Goal

Pawan Kalyan Own Goal

Pawan Kalyan Goals : తెలంగాణ ఎన్నికలు చాలామందికి చాలా గుణపాఠాలు నేర్పుతాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ తమ పార్టీ అభ్యర్థులను తెలంగాణ ఎన్నికల బరిలోకి దింపి ఏం విజయం సాధించారు అనేది ఆయన పార్టీ నాయకులు ఎలాగూ ఆత్మ పరిశీలన చేసుకుంటారు. ప్రత్యర్ధులు ఎలాగూ బాణాలు సంధిస్తారు. రాజకీయ విశ్లేషకులు తమ దారిన తాము విశ్లేషణలు చేస్తారు. ఒక్కొక్క పార్టీ తప్పొప్పుల చిట్టాలు ఇప్పుడిప్పుడే పొరలు వీడుతున్నాయి. కొందరు ప్రత్యర్థుల మీద విజయం సాధించి విజేతలుగా నిలుస్తారు. కొందరు తమ మీద తాము విజయం సాధించి ప్రత్యర్థుల చేతుల్లో ఓడిపోయి పరాజితులుగా నిలుస్తారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసింది కూడా అదే. బిజెపి మీద వల్లమాలిన అభిమానంతో, బిజెపి పన్నిన వ్యూహంలో ఆయన చిక్కుకుపోయి తెలంగాణలో తమ అభ్యర్థులను పోటీకి నిలబెట్టారు. బిజెపితో తనకున్న మమతానుబంధాన్ని ఈ విధంగా ప్రకటించడంలో ఆయన విజయం సాధించాడు. బిజెపితో తన పార్టీ పొత్తులో ఉందని, హైదరాబాదులో, సరిహద్దు జిల్లాల్లో తమ అభిమానులు అశేషంగా ఉన్నారని తమ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెలంగాణలో పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.

We’re Now on WhatsApp. Click to Join.

ఈ నిర్ణయం తన భవిష్యత్తు మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది అనే విషయం ఆయన పెద్దగా ఆలోచించినట్లు లేదు. బిజెపి మాట మీద, బీఆర్ఎస్ నాయకులకు పరోక్షంగా సహాయ పడగలను అనే రహస్య అనురాగంతో ఆయన ఈ ఎన్నికల్లోకి దిగారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేకపోయినా, గణనీయంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చగలిగితే ఆ మేరకు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగి, అధికార బీఆర్ఎస్ పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంటుందని ఆయన అంచనా కాబోలు. అంచనాలు, వ్యూహాలు, ఎత్తుగడలు ఒక్కోసారి తలకిందులు అవుతాయి. పడవ బోల్తా పడినప్పుడు గాని నది లోతు ఎంతో తెలియదు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అనుకున్నది ఒక్కటి, తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో జరిగింది మరొకటి. జనసేన అభ్యర్థులు 8 స్థానాల్లో నిలబడ్డారు. హైదరాబాదులోనూ ఖమ్మం జిల్లాలోనూ ఎక్కువ స్థానాలు ఉన్నాయి. ఆంధ్రా సెటిలర్లు గణనీయంగా ఉన్నచోట్ల మాత్రమే జనసేన అభ్యర్థులు నిలబడటం వెనక ఉన్న ఉద్దేశం ఏమిటో నిర్లక్ష్యరాస్యులైన అమాయకులైన ఓటర్లకు కూడా అర్థమైంది.

కట్ చేస్తే, సీను రివర్స్ అయింది. ఒక కూకట్ పల్లి అభ్యర్థి మినహా మిగిలిన ఏడు స్థానాల్లోనూ ఐదు వేలు కూడా ఎక్కడా అభ్యర్థులు ఓట్లు సాధించకుండా డిపాజిట్లు కోల్పోవడం జనసేన పార్టీకి ఘోరమైన అవమానకరమైన పరాజయంగా రికార్డుకెక్కింది. ఒక నిరుద్యోగ యువతి బర్రెలక్క స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి సాధించిన ఓట్లు కంటే జనసేన పార్టీ అభ్యర్థులు సాధించిన ఓట్లు తక్కువ.తెలంగాణలో పోటీకి పెట్టడానికి తన అభ్యర్థులను సిద్ధం చేసిన పవన్ కళ్యాణ్ నిర్ణయం ఆత్మహత్యా సదృశంగా మారింది. ముందు చూపు లేకుండా తీసుకున్న చర్య ఆయన పార్టీకి ప్రధాన రాజకీయ క్షేత్రమైన ఆంధ్రప్రదేశ్లో తలవొంపులు తీసుకొచ్చింది. ఇప్పుడు ఆయనకి ముందూ వెనకా కూడా నిప్పుల గుండమే. అటు అధికారంలో ఉన్న వైసిపి వర్గాలు నీ బలం ఏమిటో తెలిసిందా అని పవన్ కళ్యాణ్ ని పరిహాసం చేస్తున్నారు. సరే ఇది ఎప్పుడూ ఉండే గొడవే కదా అనుకోవచ్చు.

Also Read:  Chandrababu : చంద్రబాబు కు భారీ ఊరట..

మరోపక్క సీట్ల ఒప్పందం తెలుగుదేశంతో ఇంకా ఖరారు కాలేదు. తన డిమాండ్ బలంగా పెట్టడానికి ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలు అతిపెద్ద అవరోధంగా మారాయి. ఒక్కరూ గెలవలేదు సరి కదా ఒక్క చోట మినహా మిగిలిన అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోవడం జనసేన కార్యకర్తలకు తలెత్తుకోలేని పరాభవంగా మారిపోయింది. ఇక ఇలాంటప్పుడు తెలుగుదేశం ముందు ఏ మొహం పెట్టుకొని మాకు ఇన్ని సీట్లు కావాలని డిమాండ్ చేయగలరు? చూశారా కాలం ఒక్కోసారి ఎలాంటి పరీక్ష పెడుతుందో! తెలంగాణ ఎన్నికల్లో తాను సాధించేది ఏమీ లేదని తెలిసి కూడా మరెవరికో ఉపయోగపడడానికి తనను తాను బలివేదిక మీద పెట్టుకోవడం నిజంగా జనసేన పార్టీకి చాలా విషాదకరమైన సందర్భంగా చెప్పుకోవాలి.

మరోపక్క అపరచాణుక్యుడిగా పేరుపొందిన చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఎంత తెలివిగానో వ్యవహరించారు. 2018 లో ఎదురైన అనుభవాన్ని ఆయన గుణపాఠంగా తీసుకొని ఈసారి ఎన్నికల్లో పాల్గొనడం కంటే మౌనంగా ఉండి అధికార పార్టీని గద్దె దించడానికి మరో మార్గంలో కృషి చేయడమే మంచిదని ఆయన నిర్ణయించుకున్నారు. తన పార్టీ వర్గాలకు మనస్తాపం కలిగినా సరే తెలంగాణ ఎన్నికల్లో పార్టీని పోటీకి దింపకూడదని చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ గౌరవాన్ని కాపాడిందని చెప్పాలి. ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీ రాజకీయంలో విజేతగా నిలిస్తే, పోటీ చేసిన జనసేన పరాజితగా నిలిచి అల్లరి పాలైంది. మరి ఇప్పుడు జరిగిన ఈ నష్టాన్ని పవన్ కళ్యాణ్ ఎలా పూడ్చుకుంటారు?

ముందు 11 స్థానాల్లో పోటీ చేయాలని భావించిన జనసేన ఎనిమిది స్థానాలతో సరిపెట్టుకుంది. ఆ మేరకు కూకట్ పల్లి , తాండూరు, కోదాడ, నాగర్కర్నూల్, ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట స్థానాల్లో పార్టీ పోటీ చేసింది. ఇందులో కూకట్పల్లిలో పోటీ చేసిన జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ కు మాత్రం 39,830 ఓట్లు వచ్చి అక్కడ పరువు దక్కింది. మిగిలిన చోట్ల తాండూరులో 4,087 ఓట్లు, మిగిలిన స్థానాల్లో మూడు వేల లోపు ఓట్లు తో పార్టీ అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు. ఇది జనసేన పార్టీకి కోలుకోలేని దెబ్బ. ఎవరూ ఎన్నికల్లో సరదాగా పోటీ చేయరు. ఏదో లక్ష్యంతో ఉద్దేశంతోనే రంగంలోకి దిగుతారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పొత్తులో ఉండి, రానున్న ఎన్నికల్లో విజయ భేరి మోగించాలని కలలు కంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విధంగా సెల్ఫ్ గోల్ వేసుకొని ఇంత డిఫెన్స్ లో పడిపోతారని ఆయన కూడా ఊహించి ఉండరు..

ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద, జనసేన అభివృద్ధి మీద తప్పకుండా పడుతుంది. డామేజ్ కంట్రోల్ ఎంత వేగంగా ఎంత తెలివిగా చేసుకుంటారో అంత వేగంగా ఆ పార్టీ పుంజుకుంటుంది. లేదంటే అది ఎన్నికల నాటికి భూతంగా మారే ప్రమాదం ఉంది.

Also Read:  Congress MLAs: మంత్రి పదవీ ప్లీజ్.. క్యాబినెట్ పోస్టులపై టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల లాబీయింగ్!