New Ration Cards : రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవడంతో ‘మీ సేవా’ కేంద్రాల వద్ద భారీగా ప్రజలు క్యూ కడుతున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు, పాత కార్డుల్లో సభ్యుల వివరాల్లో మార్పులు, కొత్త పేర్లు చేర్పించేందుకు అవకాశం కల్పించడంతో ప్రజలు భారీ స్థాయిలో దరఖాస్తు చేసుకుంటున్నారు. గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీపై పరిమితులు ఉండటంతో, అర్హులైన ఎంతో మంది పేద ప్రజలు ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, గ్రామసభలు, ప్రజావాణి ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించగా, అక్కడ దరఖాస్తు చేయలేని వారు ఇప్పుడు ‘మీ సేవా’ కేంద్రాల ద్వారా తమ అభ్యర్థనలను సమర్పిస్తున్నారు.
గ్రామీణ, మండల ప్రాంతాల కంటే మున్సిపాలిటీల్లోనే కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు అధికంగా దరఖాస్తు చేస్తున్నారని ‘మీ సేవా’ కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. సోమవారం రాత్రి నుంచి అప్లికేషన్ల కోసం వెబ్‌సైట్ అందుబాటులోకి రావడంతో, పెద్ద సంఖ్యలో ప్రజలు దరఖాస్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రజాపాలన, కుల గణన ద్వారా 10.50 లక్షల కొత్త దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా, పాత కార్డుల్లో మార్పులు, చేర్పులకు 26 లక్షల దరఖాస్తులు సమర్పించబడినట్లు వెల్లడించింది.
BJP – Pawan : పవన్ తో బిజెపి “ఆపరేషన్ సౌత్” వర్క్ అవుట్ అయ్యేనా..?
ఇప్పటికే ప్రజాపాలన, కుల గణన, ప్రజావాణి, గ్రామసభల్లో దరఖాస్తు చేసిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన దాదాపుగా పూర్తయ్యిందని, త్వరలో డిజిటల్ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వెల్లడించారు. రేషన్ కార్డుల కోసం ఇప్పటికే నాలుగు రకాల డిజైన్‌లు సిద్ధం అయ్యాయని, త్వరలోనే ప్రభుత్వం ఆమోదం తెలపగానే లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై నిర్లక్ష్యం వహించడంతో అర్హులైన పేద ప్రజలు అనేక సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. ఆరోగ్యశ్రీ, స్కాలర్‌షిప్, పింఛన్లు, ఇతర ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు అనుసంధానం ఉండటంతో, కొత్త కార్డుల కోసం ప్రజలు ఆతృతగా ఎదురుచూశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కార్డుల కోసం అవకాశం కల్పించడంతో, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబాల్లో ఆశలు చిగురించాయి. అందుకే ‘మీ సేవా’ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో ప్రజలు క్యూ కడుతున్నారు.
పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు సందర్భాల్లో, ఉగాది పండుగ నాటికి అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను అందజేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తామని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. దీంతో, రేషన్ కార్డుల కోసం వేచిచూస్తున్న వేలాది మంది కుటుంబాలకు కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. ప్రభుత్వ విధానాల మేరకు, పారదర్శకంగా రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సమాచారం. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం నెలకొన్న నిరీక్షణ త్వరలో ఫలితం చూడనుంది.
Martin Guptill: లెజెండ్ 90 లీగ్లో మార్టిన్ గుప్టిల్ ఊచకోత, 300 స్ట్రైక్ రేట్‌తో 160 పరుగులు