Municipal Elections : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పోలింగ్‌పై పడింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో ఈ నెల 11న ఓటింగ్ జరగనుంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా వార్డులను చుట్టేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు సైతం రంగంలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తించడంతో గల్లీ రాజకీయం కాస్తా ఢిల్లీ స్థాయి చర్చకు దారితీసింది. అయితే, మందమర్రి మున్సిపాలిటీ మాత్రం నోటిఫై కారణంగా ఈ ఎన్నికలకు దూరంగా ఉండటం గమనార్హం.
ఓటరు చైతన్యంపై యంత్రాంగం నజర్
రాజకీయ పార్టీలు ఓట్ల వేటలో ఉంటే, అధికార యంత్రాంగం మాత్రం 100 శాతం పోలింగ్ సాధించడమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ‘స్వీప్’ (SVEEP – Systematic Voters’ Education and Electoral Participation) ఆధ్వర్యంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఓటరు చైతన్య ర్యాలీలు, సభలు నిర్వహించి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. ఓటింగ్ యంత్రాల వినియోగం మరియు ఓటు ప్రాముఖ్యతపై వార్డుల వారీగా అవగాహన కల్పించడం ఈసారి ఎన్నికల్లో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రజాస్వామ్య వేడుకకు సర్వం సిద్ధం
పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ఇప్పుడు తెరవెనుక వ్యూహాలకు పదును పెడుతున్నారు. వార్డుల్లోని స్థానిక సమస్యల కంటే పార్టీల బలాబలాలు, వ్యక్తిగత పరపతి ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. ఒకవైపు రాజకీయ వేడి, మరోవైపు అధికారుల చైతన్య కార్యక్రమాల మధ్య ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది. ప్రచారం ముగియడంతో పోలీసులు నిఘా పెంచారు, సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపటి పోలింగ్ కోసం ఎన్నికల సిబ్బంది సామాగ్రితో ఇప్పటికే ఆయా కేంద్రాలకు చేరుకున్నారు.
