ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలపై మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత టిడిపి–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటుతున్న తరుణంలో, అభివృద్ధి–సంక్షేమం రెండింటిలోనూ ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తోంది. అయితే ఆ విజయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంలో కొంత వెనుకబాటు కనిపిస్తోంది. ముఖ్యంగా తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు అనుభవ లేమితో పలు పరిపాలనా, రాజకీయ సమస్యల్లో చిక్కుకుంటుండటం పార్టీకి ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితులపై సమీక్షించేందుకు ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నారా లోకేష్ ఈరోజు పలువురు మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
Jubilee Hills By Election : నవీన్ యాదవ్ భారీ మెజార్టీ తో గెలవబోతున్నారు – ఉత్తమ్
ఈ భేటీలో లోకేష్ మాట్లాడుతూ..“తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారు, ఇతరులతో సమన్వయం సరిగా లేకపోవడం వల్ల అనవసర వివాదాలు వస్తున్నాయి” అని వ్యాఖ్యానించారు. ఇటీవల తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సహా కొందరు కొత్త ఎమ్మెల్యేలు స్థానిక స్థాయిలో అధికార యంత్రాంగం, పార్టీ నేతలతో ఘర్షణ పడిన ఘటనల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ కొత్త ఎమ్మెల్యేలను గాడిన పెట్టే బాధ్యతను సీనియర్ మంత్రులకు లోకేష్ అప్పగించారు. “మీ అనుభవాలు, మీరు ఎదుర్కొన్న సవాళ్లు వీరితో పంచుకోండి. వీరి లోపాలు సరిదిద్దడంలో మీరు మార్గనిర్దేశనం చేయాలి. లేకపోతే వీరికి మళ్లీ ప్రజాభిమానాన్ని సంపాదించడం కష్టం” అని స్పష్టంగా తెలిపారు.
Telangana Youth : తెలంగాణ యువతకు గొప్ప శుభవార్త
అదే సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్న ప్రభుత్వ ప్రాధాన్యతను లోకేష్ మరోసారి ప్రస్తావించారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న “పార్టనర్షిప్ సమ్మిట్” విజయవంతం కావడం రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని ఆయన పేర్కొన్నారు. “వివాదాలకు దూరంగా ఉండండి, రాష్ట్ర అభివృద్ధే ప్రథమ ప్రాధాన్యం. ఈ సదస్సు విజయవంతమైతే దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు, భారీ స్థాయిలో ఉద్యోగాలు వస్తాయి” అని చెప్పారు. అలాగే ప్రతి మంత్రి, ఇన్‌చార్జ్ మంత్రి తమ జిల్లాలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు సౌకర్యాలు కల్పించే దిశగా చురుకుగా వ్యవహరించాలని లోకేష్ ఆదేశించారు. అభివృద్ధి–సంక్షేమం–శాసనపరమైన స్థిరత్వం ఈ మూడు స్తంభాలపై ప్రభుత్వం నిలవాలని ఆయన స్పష్టంగా తెలిపారు.
