Meenakshi Natarajan : మీనాక్షి నటరాజన్ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి హోదాలో పార్టీ బలోపేతానికి రాజీలేని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) రాష్ట్ర కార్యవర్గం ఎంపికకు సంబంధించిన ప్రక్రియలో ఆమె కీలక మార్పులు చేశారు. ఇందుకోసం జరిగే ఎంపిక ప్రక్రియలో ఎలాంటి రాజీకి తావు ఉండకూడదని తేల్చి చెప్పారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తున్న వారికి మాత్రమే పీసీసీ రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించాలని మీనాక్షి స్పష్టం చేశారు. అటువంటి వారి పేర్లతో జాబితాను తయారు చేసి తనకు ఇవ్వాలన్నారు. చాలా ఏళ్లుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వారికే అవకాశం దక్కాలన్నారు. దీంతో సీనియర్లకు ప్రాధాన్యత ఉంటుందనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. పీసీసీ రాష్ట్ర కార్యవర్గంలో చోటు కోసం ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పోటీ పడుతున్నారు. వీరంతా గత మూడు నెలలుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలనేది రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలకు కష్టతరంగా మారింది. మీనాక్షి(Meenakshi Natarajan) రంగంలోకి దిగాక ఈ అవాంతరాలు తొలగిపోయాయి. ఆమె సూచనల మేరకు పీసీసీ కార్యవర్గం ఎంపిక తీరు మారింది.
Also Read :Bus Crash: బస్సులు ఢీ.. 37 మంది మృతి, 39 మందికి గాయాలు
నామినేటెడ్ పదవుల భర్తీపైనా క్లారిటీ
తెలంగాణలోని నామినేటెడ్ పదవుల భర్తీపైనా ఫోకస్ పెట్టాలని మీనాక్షి సూచించారట. ఇందుకోసం జిల్లాల వారీగా అర్హులైన కాంగ్రెస్ పార్టీ నేతలను గుర్తించాలని చెప్పారట. దీనిపై జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులకు ఇప్పటికే పీసీసీ నుంచి సమాచారం అందిందట. నామినేటెడ్ పదవులకు అర్హులైన నేతల వివరాలతో జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు నివేదికలు తయారు చేసి పీసీసీకి ఇవ్వనున్నారు. ఈక్రమంలో జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫారసులను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ జాబితాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పరిశీలించి చర్చిస్తారు. తదుపరిగా ఈ లిస్టును పీసీసీ రాష్ట్ర కార్యవర్గం ఖరారుచేసి, పార్టీ అధిష్ఠానం ఆమోదం కోసం పంపుతుంది.
Also Read :New Party : తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టబోతున్నాడా..?
ఆ సమావేశాలకు మీనాక్షి
ఈ నెల మొదటివారంలో రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ సమావేశాలను నిర్వహించనున్నారు. వీటికి మీనాక్షి నటరాజన్ కూడా హాజరు కానున్నారు. పార్టీలో వర్గాలను పోషిస్తున్న నేతలతో ఆమె చర్చించే అవకాశాలు ఉన్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించే నేతలను మీనాక్షి ఉపేక్షించే అవకాశం లేదు. పైరవీలు, పలుకుబడి ఆధారంగా పదవులిచ్చే విధానం ఇక ఉండదని మీనాక్షి తేల్చి చెబుతున్నారు. అందుకు అనుగుణంగా పీసీసీ పనితీరులో మార్పులు చేయనున్నారు.