Pawan Kalyan to Campaign in Municipal Polls in Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార రంగంలోకి దిగుతుండటంతో కాంగ్రెస్ పార్టీ విమర్శల దాడి పెంచింది. తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనబోతుండటంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో బీజేపీకి క్షేత్రస్థాయిలో ఆదరణ కరువైందని, అందుకే పవన్‌ను కలిసి ‘భిక్షాం దేహీ’ అంటూ ప్రచారం కోసం వేడుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కేవలం ఆంధ్రప్రదేశ్ నాయకుడని, ఆయన మాటలు విని ఓట్లు వేసే పరిస్థితిలో తెలంగాణ సమాజం లేదని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. గతంలో తెలంగాణ భాష, యాసపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానాన్ని విమర్శిస్తూ, రాజకీయాలు ఏవైనా ఉంటే ఏపీకే పరిమితం చేసుకోవాలని మహేష్ గౌడ్ హితవు పలికారు. తెలంగాణా ప్రజలు చైతన్యవంతులని, పొరుగు రాష్ట్ర నాయకుల మాటలకు ప్రభావితం కారని ఆయన పేర్కొన్నారు. కేవలం ఓట్ల కోసం ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తే సరిపోదని, ఇక్కడి సమస్యలపై అవగాహన లేని వారు ప్రజలను ఎలా మెప్పిస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ, జనసేన మైత్రిని కేవలం ఒక అవకాశవాద రాజకీయంగానే కాంగ్రెస్ అభివర్ణిస్తోంది.
ఈ మున్సిపల్ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో పట్టణ ప్రాంతాల్లో ఓట్లు చీలిపోయే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో, కాంగ్రెస్ తన వ్యూహాలకు పదును పెడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలును ప్రజల్లోకి తీసుకెళ్తూనే, విపక్షాల పొత్తులను తిప్పికొట్టడమే లక్ష్యంగా మహేష్ గౌడ్ తన ప్రసంగాల్లో వేడి పెంచుతున్నారు. ఫిబ్రవరి 11న జరగనున్న పోలింగ్‌లో తెలంగాణ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
