KTR : తెలంగాణ రాజకీయాల్లో కలవరం రేపిన మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత పార్టీ నుంచి సస్పెండ్ కావడంపై రాజకీయ వేడి పెరిగింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై తొలిసారిగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆమె సోదరుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) స్పందించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ఈ అంశంపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు. కవిత చేసిన ఆరోపణలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, కేటీఆర్ ఘాటు స్పందన ఇచ్చారు. ఇది ఒక్కరిపై తీసుకున్న నిర్ణయం కాదు. పార్టీ లోపల సమగ్రంగా చర్చించిన తర్వాతే అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆ విషయం మీద మళ్లీ మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ సూటిగా వ్యాఖ్యానించారు. పార్టీ శ్రమించి ఎదిగింది, ఎవరైనా గౌరవంగా వ్యవహరించాలి అనే స్పష్టత ఆయన మాటల్లో కనిపించింది.
Read Also: Vande Bharat : దీపావళికే ప్రత్యేక సౌకర్యాలతో పట్టాలెక్కనున్న సూపర్ ఫాస్ట్ సర్వీస్
కాగా, తాజాగా కవిత ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. నన్ను అక్రమంగా పార్టీ నుంచి తొలగించారు. నేను ఎప్పుడూ పార్టీ వ్యతిరేకంగా పనిచేయలేదు. నా ఎదుగుదల, కార్యకలాపాలు కొంతమందికి ఇష్టంలేక కుట్రలు పన్నుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేటీఆర్ ఒక్క ఫోన్‌కైనా అడిగే బాధ్యత తీసుకోలేదు. 103 రోజులుగా ఆయన నాతో మాట్లాడలేదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా హరీష్‌రావు, బీఆర్‌ఎస్ ఎంపీ సంతోష్‌రావుపై ఆమె చేసిన విమర్శలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. రామన్నా హరీష్, సంతోష్ మీతో ఉన్నట్టుగా కనిపించొచ్చు. కానీ వాళ్లు పార్టీకి, తెలంగాణకు మేలు చేయాలనే ఆలోచనలో లేరు. వాళ్లను పక్కనపెడితేనే పార్టీకి ప్రాణం ఉంటుంది. నాన్న (కేసీఆర్) పేరు నిలబడుతుంది అంటూ ఆమె విమర్శలు గుప్పించారు.
తనపై తీసుకున్న చర్యలపై స్పందిస్తూ నన్ను సస్పెండ్ చేయడంపై వ్యక్తిగతంగా బాధపడను. కానీ, ఈ వ్యవహారంపై ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ భవన్‌లో మహిళా నేతలు స్పందించడం కొంత ఊరట ఇచ్చింది. ఇది నాటకమా? లేక మహిళా నాయకత్వానికి కొత్త నిర్వచనమా? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఇక, పై కవిత ఏ దిశగా వెళ్లనున్నదన్నది ఆసక్తికర అంశం. బీఆర్ఎస్ పార్టీ ఆమెకు తలుపులు మూసేసినట్లే కనిపిస్తున్నా, ఆమె వ్యాఖ్యలు చూస్తే సుస్పష్టంగా ఆమె రాజకీయంగా వెనక్కి తగ్గే రీతిలో లేరు. అటు కేటీఆర్ స్పందన కూడా తేలికపాటి దాని కాదు పార్టీ శ్రేణుల్లో అంతర్గత విభేదాలు మరింత స్పష్టమవుతున్నాయి.