తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి అత్యంత సీనియర్ నాయకుడైన మాజీ మంత్రి జీవన్ రెడ్డి కారు ఎక్కడం దాదాపు ఖరారైంది. జగిత్యాలలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కావడం, పార్టీలోకి ఆహ్వానించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి, కేటీఆర్‌తో చర్చల అనంతరం గులాబీ జెండా కప్పుకోవడానికి సుముఖత వ్యక్తం చేశారు. దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించిన నాయకుడు ఇప్పుడు బీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపడం కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రేవంత్ కన్నా కేసీఆరే బెటర్
ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పదేళ్ల కేసీఆర్ పాలనతో పోలిస్తే ప్రస్తుత కాంగ్రెస్ పాలన తిరోగమనంలో సాగుతోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలన కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆరోపించారు. నష్టపోయిన రైతులను ఆదుకోవడంలోనూ, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలోనూ కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే, ప్రభుత్వం మాత్రం ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తోందని, అందుకే కేసీఆర్ నాయకత్వమే సరైనదని తాను నమ్ముతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
త్వరలోనే అధికారిక ప్రకటన
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో కేసీఆర్ పాత్రను జీవన్ రెడ్డి కొనియాడారు. ఉద్యమ నాయకుడిగా తెలంగాణ కలను సాకారం చేసిన కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొందని ఆయన పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌లో చేరాలనే తన నిర్ణయం అచంచలమని, దీనికి సంబంధించిన ముహూర్తం మరియు కార్యరూపాన్ని కేటీఆర్ నిర్ణయిస్తారని వెల్లడించారు. కేటీఆర్ నిర్ణయానికి అనుగుణంగా త్వరలోనే భారీ బహిరంగ సభ ద్వారా లేదా పార్టీ కార్యాలయంలో అధికారికంగా చేరిక ఉంటుందని తెలుస్తోంది. జీవన్ రెడ్డి చేరికతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్‌ఎస్ మరింత బలోపేతం కానుంది.
