Telangana SSC Exams 2025: తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో (Telangana SSC Exams 2025) కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇకపై ఇంటర్నల్ మార్కులను తీసివేస్తూ విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 100 మార్కుల్లో 80 మార్కులకే పరీక్ష ఉండగా, 20 మార్కులు ఇంటర్నల్ మార్కులుగా ఉండేవి. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కులు ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పాఠశాల విద్యా శాఖ కీలక నిర్ణయం
తెలంగాణ పాఠశాల విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2024-2025 విద్యా సంవత్సరం నుండి పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లకు మార్కులు లేకుండా ఎక్స్టర్నల్ అసైన్మెంట్లకు 100 మార్కులు ఇవ్వనున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేడింగ్ సిస్టమ్‌కు బదులుగా మార్కుల విధానాన్ని అమలు చేయనుంది. ఇంటర్నల్ మార్కుల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
పదో తరగతి ఫీజులకు చివరి తేదీలు ఇవే!
ఇకపోతే తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అధికారులు ఫీజులను స్వీకరిస్తున్నారు. ఈరోజు అంటే నవంబర్ 28వ తేదీ వరకు ఎలాంటి రుసుము లేకుండా విద్యార్థులు ఫీజులు చెల్లించారు. ఒకవేళ గడువు దాటితే రూ. 50 ఆలస్య రుసుంతో డిసెంబర్ 2 వరకు ఫీజు చెల్లించుకోవచ్చని విద్యా శాఖ తెలిపింది. అలాగే రూ. 200 ఆలస్య రుసుంతో డిసెంబర్ 12 వరకు, రూ. 500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 21 వరకు ఫీజు చెల్లించుకునేందుకు ప్రభుత్వం అవకాశం వచ్చింది.
ఇకపోతే పదో తరగతి రెగ్యులర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి కేవలం రూ. 125 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాక్‌లాగ్స్ ఉన్న వారు కూడా ఇప్పుడే ఫీజు చెల్లించుకోవచ్చు. మూడు పేపర్లు లోపు పరీక్షలు రాయాల్సి ఉంటే రూ. 110, మూడు పేపర్ల కంటే ఎక్కువ బ్యాక్ లాగ్స్ ఉంటే రూ. 125 రూపాయలు చెల్లించాలని అధికారులు పేర్కొన్నారు. రెగ్యులర్ విద్యార్థుల కంటే ఒకేషనల్ విద్యార్థులు రూ. 60 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.