KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఫామ్‌హౌస్ నుంచి నేరుగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్నారు. జనరల్ హెల్త్ చెకప్ కోసమే ఇవాళ ఆస్పత్రికి కేసీఆర్ వెళ్లారని తెలిసింది. గతంలో కేసీఆర్ ఎక్కువగా సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లేవారు. ఇప్పుడు ఆయన ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి వెళ్తున్నారు.ఇలా ఆస్పత్రి మారడానికి కారణమేంటో తెలియరాలేదు.
Also Read :David Headley : తహవ్వుర్‌ను తీసుకొచ్చారు.. డేవిడ్ హెడ్లీ సంగతేంటి ? అతడెవరు ?
మోకాలి తుంటి మార్పిడి సర్జరీ..
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం 2023 డిసెంబరు 8న కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో కాలు జారిపడ్డారు. దీంతో ఆయన మోకాలి తుంటి విరిగింది. ఫలితంగా ఆయనకు వైద్యులు మోకాలి తుంటి మార్పిడి ఆపరేషన్ చేశారు. ఆ టైంలో రెండు మూడు నెలల పాటు కేసీఆర్ బెడ్ రెస్ట్ తీసుకున్నారు.
బీజేపీపై కేసీఆర్ గప్‌చుప్
గత కొన్ని నెలలుగా కేసీఆర్ మళ్లీ యాక్టివ్‌గా పాలిటిక్స్‌లో పాల్గొంటున్నారు. అధికార పక్షంపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. కానీ బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనడం లేదు. దీంతో రాజకీయ వర్గాలు రకరకాల అంచనాలకు వస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీతో కలిసి పోటీ చేయాలనే ప్లాన్ కేసీఆర్‌కు ఉండొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు.
వరంగల్ సభపై కేసీఆర్ ఫోకస్
ఈనెల 27న వరంగల్ నగరం వేదికగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను నిర్వహించబోతోంది. ఈ సభను కేసీఆర్(KCR) ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీ సంఖ్యలో జనసమీకరణ చేసి దీన్ని విజయవంతం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ సభకు జన సమీకరణపై ఇటీవలే తెలంగాణలోని అన్ని ఉమ్మడి జిల్లాల ముఖ్య బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో సమీక్ష నిర్వహించారు.తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయి తర్వాత నిర్వహించే తొలి ఆవిర్భావ సభను విజయవంతం చేయాలనే పట్టుదలతో గులాబీ బాస్ ఉన్నారట. తద్వారా పార్టీ క్యాడర్‌లో పునరుత్తేజం నింపాలని కేసీఆర్ అనుకుంటున్నారట.