Kavitha : బాన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొని ప్రసంగించారు. ఆ సమావేశంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంత మంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసిందని ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్కులో రాసుకుంటామని హెచ్చరించారు. కేసీఆర్ మంచోడు కావచ్చు.. కానీ నేను కొంచెం రౌడీ టైప్..ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బెదిరింపులకు పాల్పడేవారిని, కేసులు పెట్టింది పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదని కవిత అన్నారు.
Read Also: PM Modi : మే 2న అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన
బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఎవరైనా ఊరుకునేది లేదు. వాళ్ల తాతలు, ముత్తాలు, జేజమ్మలు ఎవరు దిగొచ్చినా కూడా భయపడేవాళ్లు ఎవరూ లేరు ఇక్కడ అని కవిత అన్నారు. మరోవైపు మాట తప్పడం, మడమ తిప్పడమే కాంగ్రెస్ ప్రభుత్వం నైజం అని గ్యారెంటీల అమలులో ప్రభుత్వం విఫలం చెందిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదన్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాధ్యతను కవిత తీసుకున్నారు. పార్టీ సన్నాహాక సమావేశాలను నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా వరంగల్ లో నిర్వహిస్తున్న బహిరంగసభకు పెద్ద ఎత్తున ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రజల్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కవిత పార్టీ నేతలపై జరుగుతున్న వేధింపులు, బెదిరింపులపై తరచుగా స్పందిస్తున్నారు. తాను పింక్ బుక్ నిర్వహిస్తున్నానని అందులో పేర్లు రాసుకుంటున్నానని అంటున్నారు. ఈ క్రమంలో తాను రౌడీ టైప్ అని బెదిరించడం వైరల్ గా మారుతోంది.