Site icon HashtagU Telugu

Deputy CM Bhatti : నల్లమల డిక్లరేషన్‌ను అమలు చేసి తీరుతాం.. రాజీవ్ యువ వికాసానికి వెయ్యి కోట్లు : భట్టి

Deputy Cm Bhatti Vikramarka Telangana Cm Revanth Indira Saura Giri Water Development Scheme

Deputy CM Bhatti  : ‘‘వజ్రం లాంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వజ్రాల లాంటి మంత్రుల హృదయ అంతరాల లోపలి నుంచి తీసుకొచ్చిన  గొప్ప పథకమే ఇందిర సౌర గిరి జల వికాస పథకం” అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.  ఇది దేశంలోనే గొప్ప కార్యక్రమం అని ఆయన చెప్పారు. జల్, జంగల్, జమీన్, భూమి కోసం, భుక్తి కోసం పోరాటం వంటి నినాదాలను చట్టంగా మారుస్తున్న ఈ ప్రభుత్వంలో భాగం కావడం వల్ల తన జన్మ ధన్యమైందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈరోజు (సోమవారం) నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని మాచారంలో ఇందిర సౌర గిరి జల వికాస పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. ‘‘తరతరాలుగా అడవుల్లో  ఉంటున్నా.. అటవీ సంపదపై గిరిజనులు తగిన హక్కును పొందలేకపోతున్నారు. ఈవిషయాన్ని సీఎం రేవంత్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకే నల్లమల డిక్లరేషన్‌ను ఈరోజు సీఎం రేవంత్ ప్రకటించారు. దీన్ని తు.చ తప్పకుండా అమలు చేస్తాం. ఇందుకోసం నేను, మా మంత్రి వర్గ సహచరులు అంతా సహకరిస్తాం. రాబోయే నాలుగేళ్లలో నల్లమల డిక్లరేషన్ విజయవంతంగా అమలవుతుంది’’ అని డిప్యూటీ సీఎం వెల్లడించారు.

Also Read :Trumps Advisors: ట్రంప్‌ సలహా సంఘంలోకి ఇద్దరు ఉగ్రవాదులు ?

అనేక సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్నాం

రాజీవ్ యువ వికాసం పథకానికి జూన్ 2న రూ.1000 కోట్లు విడుదల చేస్తామని భట్టి వెల్లడించారు. రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్నామని చెప్పారు. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వం అని, ఇందిరమ్మ రాజ్యాన్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలోని పోడు భూములను సాగులోకి తెచ్చి గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించేందుకే ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని తీసుకొచ్చామని భట్టి(Deputy CM Bhatti) తెలిపారు. విద్యుత్ సౌకర్యం లేని 6 లక్షల ఎకరాలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఒక్కో గిరిజన రైతుకు 2.5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే సింగిల్ యూనిట్‌గా, తక్కువగా ఉంటే సమీప రైతులను కలిపి బోర్‌వెల్ యూజర్ గ్రూప్‌గా ఏర్పాటు చేస్తారని వివరించారు. ఈనెల 25 వరకు అర్హులైన గిరిజన రైతులను గుర్తిస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు.

Also Read :Hyderabad Blasts Plan : గ్రూప్‌ 2 కోచింగ్‌ కోసం వచ్చి.. ఉగ్రవాదం వైపు మళ్లిన యువకుడు

డిప్యూటీ సీఎంకు  సీఎం రేవంత్ రిక్వెస్ట్

ఈసభలో సీఎం రేవంత్ ప్రసంగిస్తూ.. ‘‘మా ఉప ముఖ్యమంత్రి గారికి నాదొక సూచన. ఇందిర సౌర గిరి జల వికాసం పేరు పలకడానికి మాకు కొంచెం కష్టంగా ఉంది. దీని పేరును ‘ఇందిరా సోలార్ గిరి జల వికాసం’గా మార్చండి. సౌర అనే బదులు సోలార్ అని పెడితే మా వాళ్లకు అల్కగా అర్థమైతది. మేం అల్కగా మాట్లాడటానికి ఉంటది. పేరు మార్చాలని డిప్యూటీ సీఎంను విజ్ఞప్తి చేస్తున్నా’’ అని సీఎం రేవంత్ తెలిపారు.