Telangana New Emblem : తెలంగాణ అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ ఉన్నాయి. వాటి స్థానంలో అమరవీరుల స్థూపం, బతుకమ్మతో కొత్త అధికారిక చిహ్నాన్ని ఖరారు చేయాలని రాష్ట్ర సర్కారు భావిస్తోందనే ప్రచారం జరిగింది. దీనిపై వివిధ వర్గాల నుంచి ప్రభుత్వానికి దాదాపు 200కుపైగా సూచనలు వచ్చాయని తెలుస్తోంది. దీంతో మరిన్ని చర్చల తర్వాతే అధికారిక చిహ్నం ఖరారుపై నిర్ణయం తీసుకోవాలని రేవంత్ సర్కారు యోచిస్తోంది. దీంతోపాటు తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేసే అంశంపైనా ఇంకా పూర్తి క్లారిటీ లేదు. ఈనేపథ్యంలో జూన్ 2న జరగనున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర అధికారిక గీతాన్ని మాత్రమే సీఎం రేవంత్ ఆవిష్కరించనున్నట్లు చెబుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ప్రస్తుత తెలంగాణ అధికారిక చిహ్నంలో రాచరికపు గుర్తులున్నాయని, వాటిని తొలగిస్తామని ఇటీవల సీఎం రేవంత్ ప్రకటించారు. పలువురు రాష్ట్ర మంత్రులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అమరుల త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తిని అద్దంపట్టేలా తెలంగాణ చిహ్నం ఉండాలని భావిస్తున్నట్లు వారు తెలిపారు. ఈక్రమంలోనే కొత్త అధికారిక చిహ్నాన్ని డిజైన్ చేయించేందుకు చిత్రకారుడు రుద్ర రాజేశంతో ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. కొన్ని డిజైన్లను కూడా తయారు చేయించారు. దీనిపై రాష్ట్ర మంత్రివర్గం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి సూచనలు, సలహాలు తీసుకుని.. ఆ ఫీడ్ బ్యాక్ ఆధారంగా తుది నిర్ణయాన్ని తీసుకోవాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా, తెలంగాణ రాష్ట్ర నూతన అధికారిక చిహ్నం(Telangana New Emblem) అంటూ సోషల్ మీడియాలో ఓ లోగో వైరల్ అవుతోంది. ఈ లోగోలో సింహాల రాజముద్ర పైన ఉండగా, కింద అమరవీరుల స్థూపం, దానికి రెండు వైపులా వ్యవసాయాన్ని ప్రతిబింబించేలా వరి కంకులు ఉన్నాయి.
Also Read :Vivekananda Rock Memorial : ప్రధాని మోడీ 45 గంటల ధ్యానం.. వివేకానంద రాక్ మెమోరియల్ గురించి తెలుసా ?
2.30 నిమిషాల నిడివితో మరో గీతం
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించిన అందెశ్రీ గీతం ‘జయ జయహే తెలంగాణ’ స్వరాలను సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి స్వరపరుస్తున్నారు. పూర్తి గీతాన్ని 13.30 నిమిషాల నిడివితో రూపొందించారు. తెలంగాణ అధికారిక కార్యక్రమాల్లో, జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ఆలపించడానికి వీలుగా 2.30 నిమిషాల నిడివితో మరో గీతాన్ని రూపొందిస్తున్నారు. ప్రధాన గీతం ప్రాధాన్యత తగ్గకుండా అందెశ్రీ దీన్ని తీర్చిదిద్దారు.