Hyderabad To Vijayawada : సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి జనం పెద్దసంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు బయలుదేరారు. దీంతో హైదరాబాద్ టు విజయవాడ జాతీయరహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చౌటుప్పల్‌లోని పంతంగి టోల్ ప్లాజా వద్ద పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. 10 టోల్‍బూత్‍ల ద్వారా ఏపీ వైపు వెళ్తున్న వాహనాలను పంపిస్తున్నారు. ఏపీ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వారిని ఆరు గేట్ల ద్వారా పంపిస్తున్నారు. చౌటుప్పల్ కూడలిలో అండర్ పాస్ నిర్మాణ పనులు జరుగుతున్నందున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇవాళ, రేపు వాహనాల రద్దీ ఇదే విధంగా కొనసాగనుంది.
Also Read :Wildfires Vs Fish : లాస్ ఏంజెల్స్‌ను కాల్చేసిన కార్చిచ్చుకు ఈ చేపలే కారణమట !
గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లేవారు..
ఈ ట్రాఫిక్ రద్దీ నుంచి తప్పించుకునేందుకు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు నార్కట్‌పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై ప్రయాణిస్తుంటారు. దీనివల్ల హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, చౌటుప్పల్, పంతంగి టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకొనే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఆయా ప్రాంతాలకు వెళ్లేవారు హైదరాబాద్-నాగార్జునసాగర్ హైవే మీదుగా జర్నీ చేస్తే బెటర్. దీనివల్ల దూరం కొంత పెరిగినా ప్రయాణం సాఫీగా జరుగుతుంది. హైదరాబాద్ నుంచి వెళ్లేవారు ఓఆర్‌ఆర్‌పైకి వెళ్లి బొంగులూరు గేట్ వద్ద ఎగ్జిట్ తీసుకుని, నాగార్జునసాగర్ హైవేలోకి ఎంటర్ అయితే సరిపోతుంది.
ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లేవారు..
హైదరాబాద్ నుంచి ఖమ్మం, విజయవాడ వైపునకు(Hyderabad To Vijayawada) వెళ్లేవారు భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరొచ్చు. ఇందుకోసం హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పైకి వెళ్లి ఘట్‌కేసర్‌లో ఎగ్జిట్ తీసుకొని వరంగల్ హైవేలోకి ఎంటర్ కావాలి. సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ మీదుగా కూడా నేరుగా భువనగిరికి వెళ్లొచ్చు. ఈ మార్గంలో నార్కట్‌పల్లి దాటిన తర్వాత పెద్దగా ట్రాఫిక్ చిక్కులు ఉండవు. ఎందుకంటే నార్కట్‌పల్లి నుంచి కొన్ని వాహనాలు మిర్యాలగూడ మీదుగా అద్దంకి, చెన్నై వైపునకు వెళ్లిపోతాయి. కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌గేట్ దాటిన తర్వాత ఇంకొన్ని వాహనాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా వైపునకు మళ్లుతాయి. అక్కడే కొన్ని వాహనాలు విజయవాడ వైపు మళ్లుతాయి. ఆ తర్వాత వచ్చే రెండు టోల్‌ప్లాజాల వద్ద పెద్దగా ట్రాఫిక్‌జామ్ సమస్య ఉండదు.
Also Read :Ration Cards : రేషన్ కార్డులో క్రెడిట్ కార్డు తరహా ఫీచర్లు.. క్యూఆర్ కోడ్‌తో జారీ
విజయవాడ సమీపంలో పశ్చిమ బైపాస్..
హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వెళ్తున్న వాహనాలను శుక్రవారం నుంచి విజయవాడ సమీపంలో నిర్మించిన పశ్చిమ బైపాస్ మీదుగా మళ్లిస్తున్నారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా శుక్రవారం నుంచే ఈ బైపాస్ మీదుగా రాకపోకలకు అనుమతిస్తున్నారు. గొల్లపూడి- చిన్నఅవుటపల్లి మధ్య ప్రయాణానికి గంటలోపే సమయం పడుతుంది.
అదనపు రైళ్లు..
సంక్రాంతి సందర్బంగా 26 అదనపు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. ఈనెల 17 వరకు ఇవి నడుస్తాయి. చర్లపల్లి నుంచి విశాఖ మార్గంలో, సికింద్రాబాద్ నుంచి బెంగళూరు మార్గంలో అదనపు రైళ్లు నడుస్తాయి.