Ramanthapur Incident : హైదరాబాద్ నగరంలోని రామంతపూర్ గోఖలే నగర్‌లో జరిగిన శ్రీకృష్ణాష్టమి శోభాయాత్రలో విషాదం చోటుచేసుకుంది. భక్తి ఉత్సాహంతో సాగుతున్న రథోత్సవం క్షణాల్లోనే కరుణాకరమైన ఘటనగా మారింది. రథానికి విద్యుత్ తీగలు తాకడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని తక్షణమే సమీప ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అనూహ్యంగా జరిగిన ఈ ప్రమాదంతో మృతుల కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. వేడుకగా ప్రారంభమైన శోభాయాత్ర చివర్లోనే మరణ శోకంగా మారడం స్థానికులను కుదిపేసింది. మరోవైపు ఆసుపత్రి వద్ద గాయపడినవారి బంధువులు కన్నీరు మున్నీరుగా తమ వారి ఆరోగ్య సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. మంత్రి శ్రీధర్ బాబు మృతుల కుటుంబాలను కలిసి వారికి భరోసా ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, “ఈ సంఘటన చాలా బాధాకరం. చనిపోయిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తాం. గాయపడినవారి చికిత్స ఖర్చులను పూర్తిగా ప్రభుత్వం భరిస్తుంది” అని ప్రకటించారు.
JC Prabhakar Reddy: కేతిరెడ్డి పెద్దారెడ్డి దమ్ముంటే తాడిపత్రికి రా… తేల్చుకుందాం..
అలాగే ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, “మరికొన్ని వంద మీటర్ల దూరంలో శోభాయాత్ర ముగియబోతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరం” అన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, కేబుల్ వైర్ ద్వారా విద్యుత్ సరఫరా జరగడంతో రథానికి షాక్ తగిలి ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తుకు హైదరాబాద్ కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.
“దర్యాప్తు రిపోర్టు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడైనా కేబుల్ వైర్లు విద్యుత్ తీగలకు తాకే పరిస్థితులు లేకుండా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించాం” అని ఆయన స్పష్టం చేశారు. కృష్ణాష్టమి సందర్భంగా ప్రతి ఏటా రామంతపూర్ ప్రాంతంలో జరిగే శోభాయాత్రకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారు. ఈసారి కూడా ఉత్సాహంగా ప్రారంభమైన ఈ వేడుకలో కొద్దిపాటి నిర్లక్ష్యం ఐదుగురి ప్రాణాలను బలి తీసుకుంది. స్థానికుల ఆనందాన్ని ఈ ప్రమాదం ఒక్కసారిగా శోకంగా మార్చేసింది.
Krishna Ashtami : కృష్ణాష్టమి వేడుకల్లో అపశ్రుతి.. కరెంట్ షాక్ తో ఐదుగురు దుర్మరణం