అర్ధరాత్రి వేళ.. అపార్ట్‌మెంట్ గేటు బయట గుర్తుతెలియని వ్యక్తులు.. నిశ్శబ్దంగా ఒక వ్యక్తిని కారులో ఎక్కించుకుని మాయమయ్యారు. దీంతో తన భర్త కనిపించలేదని భార్య కన్నీరుమున్నీరైంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ దృశ్యాలు చూసి పోలీసులు కూడా అది ‘కిడ్నాప్’ అనే అనుమానించారు. కానీ.. కేసు లోతుల్లోకి వెళ్లేకొద్దీ దిమ్మతిరిగే నిజం తెలిసింది. అది కిడ్నాపర్లు ఆడిన నాటకం కాదు.. సాక్షాత్తూ ఆ భర్తే ఆడిన మైండ్ గేమ్ అని.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన ఓ మహిళ తన భర్తను కిడ్నాప్ చేశారని ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుర్తుతెలియని వ్యక్తులు గేటు బయటకు తీసుకెళ్లి వాహనంలో ఎక్కించుకొని వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించిందని, రెండు రోజులుగా ఫోన్ స్విచ్ఛాప్ చేసి ఉండటంతో ఆమె ఆందోళన చెందింది. తన భర్త ఆచూకీ కనుక్కోవాలని పోలీసులను వేడుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. ప్రియురాలితో గడపడానికి ఆమె భర్తే కిడ్నాప్ డ్రా ఆడినట్లు తెలిసింది.
రామంతాపూర్ డివిజన్‌లోని గాంధీనగర్ జనప్రియ అపార్టుమెంటులో నివసించే రావూరి పూర్ణచందర్(34)కు భార్య, తొమ్మిదేళ్ల కుమార్తె ఉంది. అతను మాదాపూర్‌లోని పబ్‌లో పర్చేజ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. రెండ్రోజుల క్రితం స్నేహితులు వచ్చారని చెప్పి తన ఫోన్‌ను ఇంట్లోనే ఉంచి డోర్ బయట గడియపెట్టి వెళ్లాడు. నడుచుకుంటూ బయటకు వెళ్లి ఇద్దరు అమ్మాయిలు, మరో వ్యక్తితో కలిసి కారులో వెళ్లిపోయాడు. ఉదయం నిద్ర లేచిన భార్య.. భర్త కనిపించకపోవడంతో అపార్ట్‌మెంట్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి కిడ్నాప్ చేశారని ఆందోళన చెందింది. అతను పనిచేసే పబ్‌కు వెళ్లి తన భర్తను కిడ్నాప్ చేశారని చెప్పింది. పబ్ నిర్వాహకులు సైతం మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అర్ధరాత్రి వచ్చిన యువతుల్లో ఒకరిని గుర్తించిన పోలీసులు ఆమెను విచారించగా అసలు విషయం బయటపడింది. పబ్‌లో చాలా రోజులుగా బెంగాలీ యువతితో పుర్ణచందర్ సహజీవనం చేస్తున్నాడని తెలిసింది. పబ్‌లో పనిచేసే యువతులతో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసులు గ్రహించారు. వారి ఫోన్ నంబరు లోకేషన్‌ను పరిశీలించగా ఒడిశాలో ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
