Bangladeshis : బంగ్లాదేశీయులు మన హైదరాబాద్ సిటీలోనూ చాలామందే ఉన్నారు. వారంతా నగరంలో వివిధ పనులు చేస్తూ ఉపాధి పొందుతుంటారు. ప్రత్యేకించి చిరు వ్యాపారాలు చేస్తుంటారు. పరిశ్రమలలో, భవన నిర్మాణ పనుల్లో కార్మికులుగా వర్క్ చేస్తారు. అయితే వీరిలో కొందరు అక్రమంగా మన దేశంలోకి వచ్చినవారే కావడం గమనార్హం. ఇంతకీ బంగ్లాదేశీయులు అక్రమ మార్గాల్లో హైదరాబాద్ దాకా ఎలా వస్తున్నారు ?
We’re now on WhatsApp. Click to Join
వాస్తవానికి బంగ్లాదేశీయులు ప్రధానంగా ఉపాధి కోసమే భారత్‌కు వస్తుంటారు. అక్కడితో పోలిస్తే మన దేశంలో వేతనాలు ఎక్కువగా ఉంటాయి. వాటికి ఆశపడి వారు ఇండియాకు వస్తుంటారు. ఇలా బంగ్లాదేశ్(Bangladeshis) నుంచి భారత్‌కు వచ్చే వారికి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌లలోని ఏజెంట్లు సహకరిస్తుంటారు. అక్రమంగా బంగ్లాదేశ్ బార్డర్‌ను దాటించి ఇండియా రైలులోకి ఎక్కించే బాధ్యతను ఏజెంట్లు తీసుకుంటారు. ఇందుకు ఆ ఏజెంట్లు ఒక్కో బంగ్లాదేశీయుడి నుంచి సగటు రూ.10వేల దాకా వసూలు చేస్తుంటారు. బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా మీదుగా బార్డర్‌ను దాటించి కోల్‌కతాకు చేర్చే బాధ్యతను ఏజెంట్లు తీసుకుంటున్నారు. అనంతరం బంగ్లాదేశీయులు కోల్‌కతాకు చేరగానే వారికి నకిలీ ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులను తయారు చేసి అందిస్తున్నారు. వాటిని తీసుకొని సదరు బంగ్లాదేశీయులు రైలు మార్గంలో తెలంగాణలోని హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఈవిధంగా హైదరాబాద్‌కు చేరిన కొందరు బంగ్లాదేశీయులను తెలంగాణ పోలీసులు విచారించగా ఈవివరాలు వెల్లడయ్యాయి.
గత రెండేళ్ల వ్యవధిలోనే దాపు వెయ్యి మందికిపైగా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా హైదరాబాద్‌కు వచ్చి ఉండొచ్చని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. వీరిని గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది అంటున్నారు. నిఘా వర్గాల హెచ్చరికలతో అక్రమ వలసదారులను గుర్తించే పనిని మొదలుపెట్టామని పోలీసులు పేర్కొంటున్నారు. ఈక్రమంలోనే గత కొన్ని రోజులుగా బాలాపూర్, కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి, పహాడీషరీఫ్, ఫలక్‌నుమా తదితర ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.