Godavari : భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. మంగళవారం ఉదయం 5 గంటల సమయానికి 51.1 అడుగులకు వరద నీరు చేరుకుంది. నీటిమట్టం ఇవాళ 55 అడుగుల వరకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈనేపథ్యంలో కాసేపట్లో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారని తెలుస్తోంది. కాళేశ్వరం, ఇంద్రావతి వైపు నుంచి పేరూరు మీదుగా భద్రాచలం దిశగా వరద పోటెత్తుతోంది. దీంతో ప్రతీ గంటకూ నీటిమట్టం పెరుగుతోంది. దాదాపు 12 లక్షల క్యూసెక్కుల గోదావరి(Godavari) వరద నీరు దిగువకు ఉరకలెత్తుతోంది.
We’re now on WhatsApp. Click to Join
వరద జలాలు ముంచెత్తడంతో భద్రాచలంలో(Bhadrachalam) భక్తులు తలనీలాలను సమర్పించే కల్యాణ కట్టను అధికారులు మూసివేశారు. వరద వల్ల స్నానఘట్టాల కిందిభాగం, ఆ ప్రాంతంలోని విద్యుత్తు స్తంభాలు మునిగాయి. గోదావరి వరదలతో ముంపు ప్రాంతాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఈ మండలాలలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. విలీన మండలాలతో భద్రాచలం పట్టణానికి రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు.
భద్రాచలం ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఇంఛార్జీలుగా ఉన్న అధికారులు పునరావస కేంద్రాల్లోనే బాధితులతో కలిసి భోజనం చేయాలని కోరారు. వరద సహాయక చర్యల్లో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించినట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ హెచ్చరించారు.
Also Read :Ram Charan : చరణ్ పెద్దిలో అలాంటి లుక్ ఉంటుందా..?
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎర్ర కాలువ, కొవ్వాడ కాలువలు ఉగ్రరూపం దాల్చడంతో వేల ఎకరాల్లో వరిపంట మునిగిపోయింది. 96 హెక్టార్లలో ఉద్యాన పంటలు మునిగాయి. నిడదవోలు మండలం తాళ్లపాలెంతో పాటు మరో మూడు గ్రామాలను ఎర్రకాలువ నీరు చుట్టుముట్టింది. కొవ్వాడ కాలువ ప్రభావంతో 3వేల హెక్టార్లలో వరి, 1,250 హెక్టార్లలో ఉద్యాన పంటలు ముంపునకు గురయ్యాయి.