Formula E race: ఓ వైపు ఫోన్ ట్యాపింగ్ కేసు.. మరోవైపు ‘ఫార్ములా ఈ-రేసు’ కేసులను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలకంగా పరిగణిస్తోంది. ఈ రెండు కేసుల ద్వారా బీఆర్ఎస్ అగ్ర నాయకులను చిక్కుల్లో పెట్టొచ్చని భావిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు ఎలాంటి ఆటంకమూ లేదు. అయితే ‘ఫార్ములా ఈ-రేసు’ కేసు వ్యవహారంపై దర్యాప్తు కోసం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి తెలంగాణ సర్కారు అనుమతిని పొందాల్సి ఉంది.
Also Read :Kailash Gahlot : కేజ్రీవాల్‌కు షాక్.. బీజేపీలోకి ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లాట్
17 ఏ/బీ నిబంధనల ప్రకారం ప్రభుత్వంలో జరిగిన నిర్ణయంపై విచారణ చేపట్టాలంటే ప్రభుత్వ అధిపతిగా గవర్నర్ నుంచి అనుమతిని పొందడం తప్పనిసరి. అందుకే ‘ఫార్ములా ఈ-రేసు’(Formula E race) కేసుపై దర్యాప్తు కోసం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతిని రేవంత్ సర్కారు కోరింది. దీనికి సంబంధించిన ఫైలును మూడు వారాల క్రితమే గవర్నర్‌కు పంపింది. అయినా ఇప్పటిదాకా గవర్నర్ నుంచి అనుమతి లభించలేదు. దీనివల్ల పలువురు బీఆర్ఎస్ అగ్ర నేతలు ‘ఫార్ములా ఈ-రేసు’ కేసులో అరెస్టు నుంచి తప్పించుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ ఈ కేసుపై విచారణ జరపొచ్చని గవర్నర్ చెబితే..బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగలనుంది. ఈ కేసులో ఏసీబీ దూకుడుగా ముందుకు వెళ్లేందుకు గవర్నర్ ఆదేశాలు దోహదం చేస్తాయి. వెరసి పలువురు బీఆర్ఎస్ అగ్రనేతలను అరెస్టు చేసే అవకాశాలు పెరుగుతాయి.
Also Read :Miss Universe 2024 : ‘విశ్వ సుందరి-2024’ విక్టోరియా కెజార్.. ఆమె ఎవరు ?
రాష్ట్ర ప్రభుత్వం పంపే ఫైల్స్‌పై ఏవైనా న్యాయసందేహాలు వస్తే .. కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్ నుంచి సలహాలు పొందే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. ‘ఫార్ములా ఈ-రేసు’ కేసు ఫైల్‌పైనా అటార్నీ జనరల్ నుంచి గవర్నర్ న్యాయ సలహా పొందే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటివరకైతే గవర్నరు ఆఫీసు నుంచి ఎలాంటి ఫైల్ కూడా అటార్నీ జనరల్ ఆఫీసుకు వెళ్లలేదని తెలుస్తోంది. ఈనేపథ్యంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏం చేయబోతున్నారు ? ‘ఫార్ములా ఈ-రేసు’ కేసుపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ? కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయనకు ఏదైనా సంకేతం అందే అవకాశం ఉందా ? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.