Telangana Ropeways : తెలంగాణలో తొలి రోప్ వే ఏర్పాటు కాబోతోంది. శతాబ్దాల చరిత్ర ఉన్న భువనగిరి కోటపై దీన్ని ఏర్పాటు చేయనున్నారు. భువనగిరి కోట పక్కనే హైదరాబాద్-వరంగల్ 165వ జాతీయ రహదారి ఉంటుంది. ఈ జాతీయ రహదారి నుంచి భువనగిరి కోట వరకు దాదాపు కిలోమీటరు పరిధిలో రోప్‌వే ఉంటుంది. నడక మార్గంలో ఈ కోటపైకి వెళ్లాలంటే సగటున 1 గంట సమయం పడుతుంది. రోప్ వే అందుబాటులోకి వచ్చాక.. కొన్ని నిమిషాల్లోనే కోటపైకి టూరిస్టులు అడుగు పెట్టొచ్చు. హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో రోప్ వే ఏర్పాటు తర్వాత భువనగిరి కోటకు పర్యాటకుల తాకిడి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కోటపై ఉన్న నీటి కొలనును పునరుద్ధరించనున్నారు. లోపల ఉన్న చారిత్రక కట్టడాలను(Telangana Ropeways) కూడా పునరుద్ధరిస్తారు. ప్రవేశద్వారం, రోడ్లు, పార్కింగ్ వసతులను అందుబాటులోకి తెస్తారు.
నిధుల వ్యయం ఇలా..
కేంద్ర ప్రభుత్వం స్వదేశీదర్శన్ 2.0 స్కీం కింద మంజూరు చేసిన రూ.56.81 కోట్లను భువనగిరి కోట రోప్ వే పనులకు ఖర్చు చేయనున్నారు. రోప్ వే ఏర్పాటు సహా ఈ పనులన్నీ చేయడానికి తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఇటీవలే టెండర్లు పిలిచింది. రోప్‌వే నిర్మాణానికిి దాదాపు రూ.15.20 కోట్లు ఖర్చు చేయనున్నారు. 30 మీటర్ల వెడల్పుతో యాక్సెస్‌రోడ్డు, పార్కింగ్ వసతుల ఏర్పాటుకు రూ.10.73 కోట్లు వెచ్చిస్తారు. ప్రవేశద్వారం, టూరిజం సదుపాయాలు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణకు రూ.10.37 కోట్లు ఖర్చు చేస్తారు. కోటపై మౌలిక సదుపాయాల కల్పనకు రూ.9.40 కోట్లు ఖర్చు పెడతారు. ఇతరత్రా ఏర్పాట్లకు రూ.11.11 కోట్లు వెచ్చిస్తారు.
Also Read :Fact Check: పురావస్తు తవ్వకాల్లో దొరికింది.. ఘటోత్కచుడి ఖడ్గమేనా ?
గుట్ట, నల్గొండ, సాగర్, మంథనిలోనూ..
తెలంగాణలోని మరో నాలుగు చోట్ల కూడా రోప్‌వేలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. పర్వతమాల ప్రాజెక్టు కింద మరో నాలుగు రోప్ వేలను మంజూరు చేయాలంటూ కేంద్రసర్కారుకు ప్రతిపాదనలు పంపారు. వాటికి ఆమోదం లభిస్తే.. భువనగిరి కోటకు తోడుగా మరో నాలుగు చోట్ల కూడా రోప్ వేలను మనం చూస్తాం. ఈ జాబితాలో యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఉంది. ఇక్కడ దాదాపు 2 కి.మీ పరిధిలో రోప్ వే ఏర్పాటయ్యే అవకాశం ఉంది. నల్గొండ పట్టణంలోని హనుమాన్ కొండపై 2కి.మీ పరిధిలో రోప్ వే అందుబాటులోకి రావొచ్చు. నాగార్జునసాగర్ ఆనకట్టపై 5 కి.మీ పరిధిలో రోప్ వే నిర్మాణానికి ప్రతిపాదన ఉంది. మంథనిలోని రామగిరి కోటపై 2 కి.మీ మేర రోప్ వే నిర్మాణానికి ప్రతిపాదన చేశారు.