Police Department Donation: ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా పలు ప్రాంతాల్లో పంట నష్టం, ప్రాణ నష్టం, ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారు. దీంతో ప్రభుత్వం పిలుపు మేరకు వరద బాధితుల సహాయార్ధం ప్రముఖులు, సెలబ్రీటీలు, నేతలు, ప్రజలు భారీగా సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే వరద బాధితుల కోసం తెలంగాణ పోలీసులు ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇచ్చారు. తెలంగాణ పోలీసుల తరపున ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.11,06,83,571ల విరాళం అందించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ఎస్సై పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి డీజీపీ జితేందర్ చెక్‌ను అందజేశారు.
Read Also: Sara Tendulkar: తేనెటీగల దాడి నుంచి తప్పించుకున్న సారా టెండూల్కర్..!
తెలంగాణ పోలీస్ అకాడమీలో ఎస్సై పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..కని పెంచిన తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేలా యువత సక్రమమైన దారిలో నడవాలని ఆకాంక్షించారు. ఉద్యోగాల కల్పనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, TGPSCలో అక్రమాలకు తావు లేకుండా ఆ సంస్థను ఇప్పటికే పూర్తిగా ప్రక్షాళన చేశామని తెలిపారు. ఈ ఏడాదిలోనే మరో 35 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెలవేరలేదని అన్నారు. తమ ప్రభుత్వ పని తీరుపై యువకులకు ఎలాంటి అనుమానాలు, అపోహలు అక్కర్లేదని అన్నారు. కొందరు చెడు వ్యసనాలకు అలవాటు పడి డ్రగ్స్‌ను విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ లో కొత్తగా చేరిన వారు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి వ్యసనాలకు స్థానం ఉండకుండా చేయాలని అన్నారు. ఇప్పటికే 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని గుర్తు చేశారు.