Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు. టేబుల్‌పై వెపన్ పెట్టి ఆనాటి స్పెషల్ ఇంటెలీజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) చీఫ్ ప్రభాకర్ రావు తనను బెదిరించే ప్రయత్నం చేశారని ఆయన పేర్కొన్నారు. బతుకుమీద ఆశ లేదా అని తనను కేటీఆర్ బెదిరించారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ పాత్ర కూడా ఉందని వీరేశం చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ చేసినా తన గెలుపును బీఆర్ఎస్ పార్టీ అడ్డుకోలేకపోయిందని తెలిపారు.
Also Read :Islamic Nation : రాజ్యాంగం నుంచి ‘సెక్యులర్’ తీసేస్తారా ? బంగ్లాదేశ్ ఇస్లామిక్ దేశం అవుతుందా ?
‘‘వికారాబాద్ లగచర్ల ఘటనలోనూ కేటీఆర్ హస్తం ఉంది. సురేశ్ కాల్ రికార్డింగ్‌లో కేటీఆర్ బండారం బయటపడింది. ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలి’’ అని వేముల వీరేశం డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ పోలీసుల ఎదుట విచారణకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. చిరుమర్తి లింగయ్య తర్వాత వారిద్దరిని విచారణకు పిలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Also Read : Lottery King : లాటరీ కింగ్‌పై ఈడీ రైడ్స్.. 20 ప్రాంతాల్లో సోదాలు
ప్రభాకర్ రావు ఎక్కడ ? ఏం చేస్తున్నాడు ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు(Phone Tapping Case) పరారీలో ఉన్నారు. ఆయన ప్రస్తుతం అమెరికాలో తలదాచుకున్నారు. గత కొన్ని నెలలుగా అక్కడే ఉంటున్న ప్రభాకర్ రావుకు గ్రీన్‌కార్డు మంజూరైందని తెలుస్తోంది. అమెరికాలోని కుటుంబసభ్యుల సహకారంతో ఆయన గ్రీన్‌కార్డును పొందినట్లు సమాచారం. గ్రీన్‌కార్డు లభిస్తే.. అమెరికాలో గరిష్ఠంగా పదేళ్లు ఉండొచ్చు. ఆ తర్వాత రెన్యూవల్ చేసుకోవాలి. ఈ సమాచారం అందిన వెంటనే.. ప్రభాకర్ రావును తెలంగాణకు తీసుకొచ్చేందుకు ఏం చేయాలి ? ఈవిషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవిధమైన సహకారం పొందాలి ? అనే దిశగా తెలంగాణ పోలీసుశాఖ మేధోమధనం చేస్తోంది. ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేస్తారని తెలుస్తోంది.