KTR Vs ED : ఫార్ములా ఈ కార్ రేసు కేసులో రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నిస్తోంది. ఈ కేసుతో ముడిపడిన ఆర్థిక లావాదేవీలపై ఆయనను ప్రశ్నలు అడుగుతోంది. మనీలాండరింగ్ కోణంలో జరిగిన అవకతవకలపై కేటీఆర్ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నాన్ని ఈడీ అధికారులు చేస్తున్నారు. అయితే అంతకుముందు ఈడీ ఆఫీసు వద్దకు కేటీఆర్ కారు చేరుకోగానే.. పెద్దసంఖ్యలో బీఆర్‌ఎస్ శ్రేణులు ఈడీ ఆఫీసు వద్దకు పరుగుపరుగున వచ్చాయి. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఈడీ కార్యాలయం లోపలికి దూసుకెళ్లేందుకు యత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈక్రమంలో కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్ కారును చుట్టుముట్టి ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. పోలీసులు అతి కష్టం మీద వారందరినీ అక్కడి నుంచి తరలించారు. అనంతరం కేటీఆర్ కారు ఈడీ ఆఫీసు లోపలికి వెళ్లింది.
Also Read :PV Narasimha Rao : 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ హెడ్ క్వార్టర్‌లో పీవీ నరసింహారావు ఫొటోలు
పోలీసులతో బీఆర్ఎస్ శ్రేణుల వాగ్వాదం
అనంతరం ఈడీ(KTR Vs ED) కార్యాలయం వద్ద పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. వారి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో పోలీసుల జులుం నశించాలి అంటూ కొందరు బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. అనుమతి లేకుండా ఈడీ ఆఫీసు లోపలికి వెళ్లారంటూ కొందరు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాదాపు వంద మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఈడీ కార్యాలయం నుంచి పలు పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. ఈ ఉద్రిక్తత నేపథ్యంలో ఈడీ ఆఫీసు వద్ద ఆంక్షలు అమలవుతున్నాయి. ఆ మార్గంలో వాహనాలను అనుమతించడం లేదు. గన్‌పార్క్ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను మరో మార్గంలోకి మళ్లిస్తున్నారు. కేవలం ఆయ్‌కర్ భవన్ మీదుగా వచ్చే వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతి ఇస్తున్నారు.