Telangana Secretariat : తెలంగాణ సెక్రటేరియట్‌లో ఎన్నికల వేడి రాచుకుంది. సచివాలయ ఉద్యోగ సంఘాల ఎన్నికల ప్రచారం జోరును అందుకుంది. సచివాలయంలోని అన్ని విభాగాల ఉద్యోగులను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు. ప్రతీ విభాగానికి వెళ్లి తమకే ఓటు వేయాలంటూ సచివాలయ ఎంప్లాయీస్‌ను కోరుతున్నారు. సచివాలయ ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లో సైతం ఈ ప్రచారానికి సంబంధించిన పోస్టులే చక్కర్లు కొడుతున్నాయి. ఉద్యోగులను ఆకట్టుకునేలా ఉండే సందేశాలతో రోజూ గుడ్ మార్నింగ్‌లు, గుడ్ నైట్‌లు చెబుతున్నారు. ఇక కరపత్రాలను కూడా పంచి పెడుతున్నారు. మొత్తం మీద ప్రస్తుతం తెలంగాణ సచివాలయం మొత్తం ఎన్నికల సందడి కనిపిస్తోంది.
Also Read :US Treasury Hacked : ఏకంగా అమెరికా ట్రెజరీపై చైనా సైబర్ ఎటాక్ !
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత సచివాలయ ఉద్యోగ సంఘాల(Telangana Secretariat) ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. దీంతో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ సచివాలయ ఉద్యోగ సంఘాల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జనవరి 4న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగనుంది. మొత్తం 1,104 మంది ఓటర్లు ఉన్నారు. 11 పోస్టుల కోసం 67 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ పోస్టులకు తీవ్ర పోటీ ఉంది. యూనియన్లతో సంబంధం లేకుండా విడిగా చాలా మంది ఉద్యోగులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దీంతో ఎవరు గెలుస్తారో అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది.