HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రతిష్ఠను మసకబార్చేలా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) తరఫున డి.గురువారెడ్డి పంపిస్తున్న ఈమెయిల్స్, తప్పుడు సమాచార వ్యాప్తి విషయాలను ముంబై హైకోర్టుకు హెచ్‌సీఏ నివేదించింది. ఆ ఈమెయిల్స్‌ను టీసీఏ ఉపసంహరించుకోవాలని, ఆవిధంగా మరోసారి సందేశాలను పంపించొద్దని కోర్టు మార్చి 19న ఆదేశాలు జారీ చేసింది. అందుకు అంగీకరిస్తున్నట్టు కోర్టుకు టీసీఏ తెలిపింది. టీసీఏ తరఫున తప్పుడు సమాచారంతో డి.గురువారెడ్డి విడుదల చేస్తున్న పలు ప్రెస్ నోట్లు, స్టేట్‌మెంట్లతో గందరగోళానికి గురికావద్దని ఈ సందర్భంగా హెచ్‌సీఏ కోరింది. టీసీఏతో చర్చించేందుకు హెచ్‌సీఏ అడహక్ కమిటీతో కాకుండా అపెక్స్ కౌన్సిల్‌తో భేటీ కావాలని న్యాయస్థానం సూచించింది. ఆ ఆర్డర్ కాపీ కోసం వేచి చూస్తున్నట్లు హెచ్‌సీఏ(HCA) ఓ ప్రకటనలో వెల్లడించింది.
Also Read :Cabinet Expansion: ఉగాదికల్లా మంత్రివర్గ విస్తరణ.. కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్ భేటీ
హెచ్‌సీఏ నిధుల గోల్‌మాల్ కేసులో..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిధుల గోల్‌మాల్ కేసులో ఇటీవలే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చర్యలు చేపట్టింది. హెచ్‌సీఏకి చెందిన రూ. 51 లక్షల ఆస్తులను అటాచ్ చేసింది. హెచ్‌సీఏ నిధులతో ప్రైవేట్ ఆస్తులు కొన్నట్లు తమ దర్యాప్తులో ఈడీ గుర్తించింది. అనుమతులు లేకుండా పరికరాలను కొన్నట్లు వెల్లడైంది.క్రికెట్ బంతులు, జిమ్ పరికరాలతోపాటు బకెట్, కుర్చీల కొనుగోలులో సైతం నిధుల దుర్వినియోగం అయినట్లు ఈడీ గుర్తించింది. కాంట్రాక్టుల పేరుతో క్విడ్ ప్రో కో జరిగినట్లు ఈడీ అభియోగాలను నమోదు చేసింది. హెచ్‌సీఏ మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్‌పై ఈడీ అభియోగం నమోదు చేసింది. క్రికెట్ బాల్స్, బకెట్, చైర్స్, జిమ్ ఎక్విప్‌మెంట్ పేరుతో హెచ్‌సీఏ సబ్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఆయా కాంట్రాక్టులను అప్పగించడంతో సురేందర్ అగర్వాల్‌కు క్విడ్ ప్రోకో కింద మూడు కంపెనీలు రూ. 90 లక్షల మేర చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. రూ. 90 లక్షలలో రూ. 51.29 లక్షల ఆస్తులను ఈడీ ఇటీవలే అటాచ్ చేసింది.