MLC Vote : తెలుగు రాష్ట్రాల్లో రేపు (ఫిబ్రవరి 27న) ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. లక్షలాది మంది ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. అయితే ప్రతీసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు ఎక్కువగా ఉంటున్నాయి. దీనికి కారణం ఓటర్లకు పోలింగ్ పద్ధతిపై సరైన అవగాహన లేకపోవడమే. అందుకే మనం ఈ కథనంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే పద్ధతి గురించి తెలుసుకుందాం..
Also Read :GV Reddy : జీవీ రెడ్డికి టీడీపీ బిగ్ ఆఫర్.. ఏమిటి ? ఎందుకు ?
ఎమ్మెల్సీ ఓటు వేయడం ఇలా..
- మీకు సంబంధించిన పోలింగ్ కేంద్రానికి తప్పకుండా గుర్తింపు కార్డు, ఓటరు స్లిప్(MLC Vote) తీసుకెళ్లండి.
- పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటరు లిస్టులోని మీ పేరు, సీరియల్ నంబర్ వివరాలను చెక్ చేయండి. మీ పేరు వద్ద సంతకం చేయండి.
- ఆ తర్వాత పోలింగ్ అధికారులు మీకు బ్యాలెట్ పేపర్‌ను అందిస్తారు. పెన్ ఇస్తారు. ఆ పెన్నుతో మాత్రమే ఓటేయాలి.
- బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థుల క్రమ సంఖ్యలు, వారి పేర్లు, ఫొటోలు వరుసగా ఉంటాయి. పార్టీల గుర్తులు కానీ, వాటి సింబల్స్ కానీ ఉండవు.
- బ్యాలెట్ పేపర్‌లో మీకు ఇష్టమైన అభ్యర్థి పేరు ఎదుటనున్న ఖాళీ బాక్స్‌లో “1” అని నంబర్ వేయాలి.
- మిగిలిన వారికి 2, 3, 4, 5 ఇలా ఎంత మంది ఉంటే అంతమందికి నంబర్‌లో మీరు ప్రాధాన్యత నంబర్లు వేయొచ్చు.
- చివరగా అధికారులు సూచించిన విధంగా ఆ బ్యాలెట్ పేపర్‌ను మడత పెట్టి, బాక్సులో వేయాలి.
ఇవి అస్సలు చేయొద్దు
- బ్యాలెట్ పేపర్‌లో ఉన్న అభ్యర్థులు అందరికీ ఒకటే నంబర్ వేయొద్దు. ఒకరికి వేసిన నంబరు మరొకరికి వేయకూడదు.
- ప్రాధాన్యత నంబరును ఇంగ్లీష్ భాషలో కానీ, రోమన్ నంబరులో కానీ వేయొద్దు. కేవలం అంకెల్లోనే రాయాలి.
- బ్యాలెట్ పేపర్‌ను ఇష్టం వచ్చినట్టుగా మడత పెడితే, మీరు రాసిన ప్రాధాన్యత అంకెలు ఇంకొకరి ఎదురుగా పడతాయి. అలాంటి ఓట్లు చెల్లవు.
- ప్రాధాన్యత అంకె వేయకుండా ఖాళీ బ్యాలెట్ పేపర్ వేయకూడదు.
- ఓటు వేసేటప్పుడు పెన్నుతో గట్టిగా రుద్దకూడదు. చుక్కలు, టిక్కులు పెట్టొద్దు.
- అభ్యర్థి పేరు, బాక్స్ పక్కన మాత్రమే ప్రాధాన్యత అంకె వేయాలి.
- 1వ ప్రాధాన్యత నంబరు ఇవ్వకుండా, ఆ తర్వాతి అంకెలు వేస్తే ఓటు చెల్లదు.
- అంకెలు కాకుండా సున్నాలు చుట్టడం, ✔️ పెట్టడం లాంటివి చేయొద్దు.